Telangana: జిల్లాలకు ఎన్నికల అధికారులు, ఈఆర్వోల నియామకం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో జిల్లాల ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.
By అంజి
Telangana: జిల్లాలకు ఎన్నికల అధికారులు, ఈఆర్వోల నియామకం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 33 జిల్లాలకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్‌ఓ), జిల్లా ఎన్నికల అధికారుల (డీఈఓ)లను నియమించింది. ఈ మేరకు అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. "ఈ అధికారులు ఓటర్ల జాబితాల నిర్వహణ, ఖచ్చితమైన ఓటరు నమోదును నిర్ధారించడం, ఎన్నికల డేటా సమగ్రతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు" అని ఈసీఐ పేర్కొంది.
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కమిషనర్ వ్యవహరించనున్నట్లు ఈసీ పేర్కొంది. అదేవిధంగా మిగిలిన 32 జిల్లాలకు ఎన్నికల అధికారులుగా ఆయా జిల్లాల కలెక్టర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈఆర్వోలుగా.. అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఐటీడీఏ పీఓలు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. ఓటర్ల జాబితా నిర్వహణ, ఓటర్ల నమోదు, వివరాలు తదితరాలను ఈఆర్వోలు పర్యవేక్షిస్తారు.
ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం.. 2023 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండనున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తారు. ఆగస్టు 21న ఓటర్ల జాబితా ప్రదర్శిస్తారు. 21వ తేదీ నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు ప్రదర్శించిన ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు, ఏవైనా నమోదులు ఉంటే స్వీకరిస్తారు. ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 3 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపడతారు. ప్రజలు, పార్టీల ప్రతినిధుల ఉంచి వచ్చిన అభ్యంతరాలను ఆగస్టు 28వ తేదీన పరిష్కరిస్తారు. అక్టోబర్ 4వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని తెలిపారు.
మంగళవారం మీడియాతో ఖమ్మం జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. జూన్ 20న ఎన్నికలకు సన్నాహకంగా జిల్లావ్యాప్తంగా ఈవీఎంలు, వీవీప్యాట్‌లకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ప్రారంభిస్తామని ప్రకటించారు. మొత్తం 3100 బ్యాలెట్ యూనిట్లు (బియులు), 2403 కంట్రోల్ యూనిట్లు (సియులు), 2359 ఓటర్-వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వివిపిఎటి) సిస్టమ్‌లు, ప్రతి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇవిఎం) జిల్లా యంత్రాంగానికి అందించబడ్డాయి. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ)కి చెందిన ఇంజనీర్లు జూన్ 25 నుంచి జూలై 9 వరకు జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలు, వీవీప్యాట్‌ల మొదటి స్థాయి చెకింగ్ (ఎఫ్‌ఎల్‌సీ)ని నిర్వహించారని కలెక్టర్ తెలిపారు.