Telangana Assembly: కోమటిరెడ్డి వర్సెస్ హరీశ్‌రావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల అంశంపై చర్చ జరిగింది.

By Srikanth Gundamalla  Published on  12 Feb 2024 9:01 AM GMT
Telangana assembly, minister komati reddy, brs, harish rao,

Telangana Assembly: కోమటిరెడ్డి వర్సెస్ హరీశ్‌రావు 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్దం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత మాట్లాడేందుకు హరీశ్‌రావుకి అవకాశం ఇచ్చారు స్పీకర్‌. ఈ మేరకు మాట్లాడిన హరీశ్‌రావు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం సత్య దూరమూన ప్రజెంటేషన్‌ ఇచ్చిందని ఆరోపించారు. పీపీటీ కోసం తమకూ అవకాశం ఇవ్వాలని కోరామనీ.. వాస్తవాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు అన్నారు. కానీ దానికి స్పీకర్‌ అనుమతి ఇవ్వకపోడం దురదృష్టకరమని హరీశ్‌రావు అన్నారు.

ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించబోము అని ప్రభుత్వం ప్రకటన చేయడం తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ విజయం అని హరీశ్‌రావు తెలిపారు. మంగలవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ సభ పెడుతున్నందుకే మంత్రి ఈ ప్రకటన చేశారనీ.. తప్పులను సవరించుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాను నాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్సే అన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటమి ఎదురైందని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో జగన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ వినలేదా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చెప్పిన తర్వాత కూడా తామే తప్పు చేసినట్లు మాట్లాడితే ఎలా అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కేసీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డికి ముఖం చెల్లకే తమ జిల్లాను మోసం చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్‌ వల్లే తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదన్నారు కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలనీ.. ముక్కు నేలకు రాయాలంటూ డిమాండ్ చేశారు. ఆ తర్వాతే నల్లగొండ సభకు రావాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

ఇక కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు వెంటనే స్పందించారు. కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలి.. ముక్కు నేలకు రాయాలనే మాటలను ఖండించారు. కేసీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిందే కేసీఆర్ అని.. అలాంటి వ్యక్తి పట్ల ఇలా మాట్లాడటం ఏమాత్రం సరికాదని హరీశ్‌రావు అన్నారు.

Next Story