సూర్యాపేటలో రసవత్తర పోరు తప్పదా? ప్రజలేమంటున్నారు..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది.

By Srikanth Gundamalla  Published on  28 Nov 2023 8:41 AM IST
telangana, assembly elections, suryapet constancy,

సూర్యాపేటలో రసవత్తర పోరు తప్పదా? ప్రజలేమంటున్నారు..? 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. మరోవైపు మంగళవారంతో ఎన్నికల ప్రచారానికి ముగింపు గడువు కావడంతో.. ఆయా ప్రాంతాల్లోని పార్టీల అభ్యర్థులు పార్టీ కేడర్‌తో ఎన్నికల పోలింగ్‌ గురించి చర్చలు జరుపుతున్నారు. అయితే.. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ పార్టీ.. మూడోసారి అధికారం కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కొన్ని నియోజకవర్గాల్లో రసవత్తర పోరు కొనసాగనున్నట్లు అర్థం అవుతోంది. కేబినెట్‌లో ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న అసెంబ్లీ సూర్యపేటలో కూడా ఈ సారి హోరాహోరీగా పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర్‌రెడ్డి... మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉండనుందని ఆ నియోజకవర్గ ప్రజల మాటలను బట్టి తెలుస్తోంది. సూర్యాపేట అసెంబ్లీలో ఈ సారి ఓటింగ్‌ శాతం ఎలా ఉండబోతుంది..? అసలు గెలుపు ఎవరిని వరించబోతుంది అనే దానిపై న్యూస్‌మీటర్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్.

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం:

సూర్యాపేట జిల్లా కేంద్రం. ఈ జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో సూర్యాపేట కూడా ఒకటి. ఈ నియోజకవర్గం కిందకు సూర్యాపేట మున్సిపాలిటీ, చివ్వేంల మండలం, పెన్‌పహాడ్, ఆత్మకూరు ఎస్‌ మండలాలు ఉంటాయి. ఈ నియోజకవరగ్ంలో మొత్తం 2,11,097 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,04,401 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,06,624 మంది ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారిధిగా నిలుస్తోంది సూర్యాపేట నియోజకవర్గం.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఉన్న సూర్యాపేట పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోంది. జిల్లా కేంద్రంగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత సూర్యాపేట రూపురేఖలే మారిపోయాయి. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రధాన కేంద్రంగా ఉన్న సూర్యాపేట నుండి ఎందరో ప్రముఖ నేతలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014, 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి వరుసగా ఎమ్మెల్యేగా జగదీశ్‌రెడ్డి గెలిచారు. మూడోసారి ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్థిగా మళ్లీ బరిలోకి దిగారు దామోదర్‌రెడ్డి. ఎలాగైనా తాను గెలిచి కాంగ్రెస్‌ సత్తా చూపించాలని చూస్తున్నారు. మరోప్రధాన పార్టీ బీజేపీ నుంచి బరిలోకి సంకినేని వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు. ఈయనకు కూడా ఇక్కడ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రన్నరప్‌గా నిలిచారు. దాంతో.. ఈసారి సూర్యాపేట పీఠం ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తిగా మారింది.

సూర్యాపేట రాజకీయం:

మొదట్లో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న సూర్యాపేటలో రానురాను కాంగ్రెస్ బలపడింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఐదు సార్లు గెలిచారు. ఆ తర్వాత టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు నాలుగుసార్లు గెలిచారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు జరిగిన ఎన్నికల్లో 2009లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన దామోదర్‌రెడ్డి.. తెలంగాణ కోసం పోరాడుతోన్న పార్టీ టీఆర్ఎస్‌ నుంచి పోటీ చేసిన అభ్యర్థిపై గెలిచారు. కానీ.. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగదీశ్‌రెడ్డి టీఆర్ఎస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కేబినెట్‌లో చేరడం.. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడుగా ఉన్నారు.దాంతో.. సూర్యాపేటను జిల్లాగా ఏర్పాటు చేయడంలో కృషి చేశారు. ఈక్రమంలోనే 2018లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు జగదీశ్‌రెడ్డి. జగదీశ్‌రెడ్డికి 2018 ఎన్నికల్లో ఐదు వేల 9 వందల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుపై కేవలం రెండు వేల రెండు వందల ఓట్ల తేడాతో గెలిచారు. దాంతో.. ఈసారి ఈ ముగ్గురు అభ్యర్థులే మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. మరోసారి ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సూర్యాపేటలో మంత్రిగా జగదీశ్‌రెడ్డి చేసిన పనులు:

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట చిన్నపట్టణంగా ఉండేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జగదీశ్‌రెడ్డి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దాంతో.. సూర్యాపేటను జిల్లాగా మార్చేందుకు కృషి చేశారు. తొమ్మిదిన్నర ఏళ్లలో సూర్యాపేట పట్టణానికి సుమారు రూ.5వేల కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశానని మంత్రి జగదీశ్‌రెడ్డి చెబుతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జగదీశ్‌రెడ్డి మార్క్‌గా చెప్పుకోవడానికి మెడికల్‌ కాలేజ్‌ మొదలు జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, మహాప్రస్థానం, ఇంటిగ్రేటెడ్, మార్కెట్ సముదాయాలతో పాటు సద్దల చెరువుని మినీ ట్యాంగ్‌బండ్‌ గా మార్చారు. పుల్లరెడ్డి చెరువుని కూడా మరో మినీట్యాంక్‌ బండ్‌గా తీర్చిదిద్ది సూర్యాపేట పట్టణ ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చారు.

మంత్రి జగదీశ్‌రెడ్డి పట్టణంలో అభివృద్ధి పనులు చేసినా.. పార్టీ క్యాడర్‌ను, మొదట్నుంచి ఆయన వెంట ఉన్నవారిని పెద్దగా పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. కొత్తగా ఆయన పార్టీలోకి కొందరిని తీసుకొచ్చి పదవులు ఇచ్చారని.. మొదట్నుంచి ఉన్నవారిని మాత్రం పక్కనపెట్టారని అంటున్నారు. దాంతో.. మంత్రి జగదీశ్‌రెడ్డిపై ఉద్యమంలో ఆయన వెంట నడిచిన ఉద్యమకారులు, జేఏసీ నేతలు, సన్నిహితులు గుర్రుగా ఉన్నట్లు అర్థం అవుతోంది.

కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర్‌రెడ్డికి పెరిగిన బలం:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1985 జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి నుండి పోటీ చేసి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు కాంగ్రెస్ సీనియర్ నేత రాం రెడ్డి దామోదర్ రెడ్డి. 1989లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. మరోసారి 1994లో కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.. దాంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తుంగతుర్తి నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేగా నిలిచారు దామోదర్‌రెడ్డి. 1999లో టీడీపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుపై పోటీ చేసి ఓడిపోయారు దామోదర్‌రెడ్డి. తుంగతుర్తిని ఎస్సీకి కేటాయించడంతో సూర్యాపేటకు దామోదర్‌రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు మకాం మార్చారు. 2009లో సూర్యాపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా దామోదర్‌రెడ్డి గెలిచారు. ఆ తర్వాత 2018లో కూడా జగదీశ్‌రెడ్డి చేతిలో ఓటమిని చూశారు. దాంతో..ఈసారి ఎలాగైనా గెలవాలని దామోదర్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచే టికెట్‌ ఆశించిన మరో సీనియర్‌ నేత పటేల్‌ రమేశ్‌రెడ్డిని కూడా ఆయన కలుపుకొని పోతున్నారు. పటేల్‌ రమేశ్‌రెడ్డి రేవంత్‌రెడ్డికి సన్నిహితుడు. ఆయన మాట చెప్పడంతో.. నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పటే రమేశ్‌రెడ్డి కూడా దామోదర్‌రెడ్డికి మద్దతు పలికారు. దాంతో.. దామోదర్‌రెడ్డికి సూర్యాపేటలో మరింత బలం పెరిగినట్లు అయ్యింది. మరోవైపు వామపక్ష పార్టీ సీపీఐ కూడా కాంగ్రెస్‌ మద్దతు పలికింది. దాంతో.. వామపక్షాల ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్‌రెడ్డికి పడే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సంకినేని వెంకటేశ్వరరావుకు కూడా ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు సూర్యాపేట నియోజకవర్గంలో బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనీ.. ఇక్కడ కూడా బీజేపీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్‌తో మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. సంకినేని వెంకటేశ్వరరావుకి కూడా సూర్యాపేటలో బలం ఉందనే చెప్పాలి. ఎందుకంటే గత 2014 ఎన్నికల్లో మంత్రి జగదీశ్‌రెడ్డికి అతి సమీప ప్రత్యర్థిగా నిలిచారు. సంకినేనిపై జగదీశ్‌రెడ్డి కేవలం 2వేల పైచిలుకు ఓట్ల తేడాతోనే గెలిచారు. దాంతో.. ఇక్కడ బీజేపీని పుంజుకునేలా చేస్తారని.. సంకినేని వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

బీఎస్పీ నుంచి వట్టె జానయ్య యాదవ్ పోటీలోకి దూసుకువచ్చారు. గతంలో జానయ్య యాదవ్‌ మంత్రి జగదీశ్‌రెడ్డికి అనుచరుడిగా ఉండేవాడు. ఆయన బీఆర్ఎస్‌ బయటకు వెళ్లిపోయి.. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో బీఎస్పీ నుంచి టికెట్‌ దక్కించుకున్నారు. ఈ క్రమంలో తనకూ ఇక్కడ అనచరులు ఉన్నారనీ.. తన గెలుపు ఖాయమని చెబుతున్నారు జానయ్య యాదవ్.

నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారంటే..

సూర్యపేట నియోజకవర్గంలో రసవత్తర పోరు ఉంటుందని.. జనాల స్పందన చూస్తే కూడా అర్థం అవుతోంది. కొందరు కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు తెలుపుతుంటే.. ఇంకొందరు కాంగ్రెస్‌కు మద్దతు చెబుతున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట పట్టణంలో తప్ప మిగతా చోట్ల పెద్దగా అభివృద్ధి చేయలేదని అక్కడ ప్రజలు చెబుతున్నారు. సూర్యాపేట పట్టణంలో కూడా ఎన్నికలకు ముందు రోడ్లు అంతగా బాగుండేవి కావడి.. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వాటిని బాగు చేయించారని చెబుతున్నారు. ఇదంతా ఎన్నికల కోసమే చేస్తున్నారంటూ మంత్రి జగదీశ్‌రెడ్డిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఇంకొందరు అయితే.. ఈసారి తమ నియోజవకర్గంలో మార్పు కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. జగదీశ్‌రెడ్డికి కాకుండా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. మరికొందరు మాత్రం బీఆర్ఎస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి అయినా.. సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధి అయినా సాధ్యమని చెబుతున్నారు. రైతుబంధు.. రైతుబీమా, దళితబంధు ద్వారా తమను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటోందని చెబుతున్నారు.

ఐటీ హబ్‌ కూడా అభివృద్ది చెబుతోందని.. తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు అందుతున్నాయని చెబుతున్నారు. జగదీశ్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాతే సూర్యాపేట జిల్లా కేంద్రం అయ్యిందనీ.. తద్వారా మెడికల్ కాలేజ్‌తో పాటు అన్ని సదుపాయాలు సమకూరాయని చెబుతున్నారు. అంతేకాదు. సూర్యాపేట పట్టణంలో అభివృద్ధి ఎంతో ముందుకెళ్లిందనీ అంటున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట నియోజకవర్గ ప్రజల నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో మరోసారి రసవత్తర పోరు కొనసాగనుందని అర్థం అవుతోంది. జగదీశ్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, సంకినేని మధ్య త్రిముఖ పోరు కొనసాగనుంది. ఈ రసవత్తర పోరులో చివరకు గెలిచి.. సూర్యాపేట పీఠం దక్కించుకునేది ఎవరనేది డిసెంబర్‌ 3వ తేదీ తర్వాతే తేలనుంది.

Next Story