మాకు ఆ తేడా లేదు.. అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ కౌంటర్
విద్యుత్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ కొనసాగింది.
By Srikanth Gundamalla Published on 21 Dec 2023 12:53 PM GMTమాకు ఆ తేడా లేదు.. అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ కౌంటర్
విద్యుత్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ కొనసాగింది. ఈ క్రమంలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ పలు అంశాలను ప్రస్తావించారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా ఉందని చెప్పారు. పాతబస్తీలో గత ప్రభుత్వ హయాంలో రూ.25వేల కోట్ల అభివృద్ధి జరిగిందని అన్నారు. 2014తో పోలిస్తే తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కూడా భారీగా పెరిగిందని అన్నారు అక్బరుద్దీన్ ఒవైసీ. నిరంతర విద్యుత్ అందించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. పాతబస్తీలో విద్యుత్ బిల్లుల అంశాన్ని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రస్తావించారు.
అక్బరుద్దీన్ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇదే అంశంపై స్పందించారు. అక్బరుద్దీన్‌కు కౌంటర్ ఇచ్చారు. అక్బరుద్దీన్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారనీ. .కానీ ప్రభుత్వాన్ని తప్పుబట్టే విధంగా మాట్లాడుతున్నారిన అన్నారు. ఓల్డ్ సిటీ, న్యూసిటీ అని తమకు తేడా లేదని చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను అక్బరుద్దీన్ మాట్లాడటం లేదన్నారు. కానీ.. కాంగ్రెస్ సర్కార్‌ను అప్పుడే తప్పు బట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్‌రెడ్డి. అక్బరుద్దీన్ కేవలం మజ్లిస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మాత్రమే అనీ.. ముస్లింలందరికీ చెందిన నాయకుడు కాదని అన్నారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీని ఓడించడానికి కేసీఆర్, అక్బరుద్దీన్ కలిసి పని చేశారని కామెంట్స్ చేశారు. కామారెడ్డిలో అభ్యర్థిని నిలబెట్టని ఎంఐఎం… అజారుద్దీన్ పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్ లో మాత్రం అభ్యర్థిని పోటీకి పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలను అక్బురుద్దీన్ ఒక్కదాని గురించి కూడా మాట్లాడటం సరికాదని అన్నారు. పాత స్నేహితుడిని రక్షించుకునేందుకు అక్బరుద్దీన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారనీ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
సీఎం రేవంత్ తర్వాత మళ్లీ మాట్లాడిన అక్బరుద్దీన్ తిరిగి కౌంటర్ ఇచ్చారు. అనేక పార్టీల్లో తిరిగి వచ్చిన రేవంత్‌రెడ్డి.. హుందాగా వ్యవహరించాలని అన్నారు. కాంగ్రెస్ తమను అణచివేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఇదే విషయంపై మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఎంఐఎం కూడా అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుందని విమర్శించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది.