కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ కులగణన తీర్మానానికి ఆమోదం తెలిపింది.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 5:29 PM ISTకులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ కులగణన తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఈ కులగణన తీర్మానాన్ని అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. ఈ మేరకు మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని ఆయన కోరారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు. అఖిలపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆనాటి సమగ్ర సర్వే వివరాలను ఎందుకు బయటపెట్టలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. పదేళ్ల బీసీల లెక్కలు తీస్తే బీఆర్ఎస్ బండారం బయటపడుతుందని చెప్పారు.
సమగ్ర సర్వే వివరాలు బయటపెడితే తమకు ఖర్చు తగ్గుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వం ఎంబీసీలకు వెయ్యి కోట్లు ప్రకటించి ఆ తర్వాత వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. బలహీన వర్గాల కోసమే తమ పోరాటమని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. బీసీ మంత్రిత్వ శాఖ కోసమే తాము పోరాటం చేశామని వెల్లడించారు. 2011 చట్టం చేయకుండానే ఓబీసీల కులగణన జరిగిందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
ఇక కులగణనపై అసెంబ్లీలో కేటీఆర్ కూడా మాట్లాడారు. కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టమని కేసీఆర్ అడిగారని గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో కులగణనపై పెట్టిన తీర్మానాన్ని తాము కూడా స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. చట్టబద్దత లేకుంటే కులగణన సఫలం కాదన్న ఆయన.. బలహీన వర్గాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. బీసీల డిక్లరేషన్‌లో ఉన్న అన్ని అంశాలను అమలు చేయాలనీ... దీనికి చట్టబద్ధత ఉంటేనే చెల్లుబాటు అవుతుందని కేటీఆర్ అన్నారు.