అసెంబ్లీ, మండలి సోమవారానికి వాయిదా
Telangana Assembly adjourned to September 27.తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం ఉదయం
By తోట వంశీ కుమార్ Published on 24 Sep 2021 6:36 AM GMTతెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసన మండలి వేర్వేరుగా సమావేశం అయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మేల్యేల సంతాప తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రవేశ పెట్టారు. ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ బొజ్జి, బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే ఎం సత్యనారాయణరావు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి, సుజాత నగర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్యకు సభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాల అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.
శాసన మండలిలో ప్రొటెం స్పీకర్ హోదాలో భూపాల్‌రెడ్డి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం మండలి కూడా సోమవారానికి వాయిదా పడింది. అనంతరం అసెంబ్లీ స్పీకర్, మండలి ప్రొటెం ఛైర్మన్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలి, ఏయే అంశానికి ఎంత సమయాన్ని కేటాయించాలనే అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 25, 26 తేదీల్లో సమావేశాలకు విరామం ప్రకటించి, తిరిగి 27వ తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.