Telangana: రూ.4వేల పెన్షన్ ఎప్పట్నుంచి ఇస్తారు..?
కాంగ్రెస్ ఎన్నికల వేళ చెప్పినట్లు ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెంచి ఇస్తారా అని ఆశగా ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 22 Jan 2024 8:02 AM GMTTelangana: రూ.4వేల పెన్షన్ ఎప్పట్నుంచి ఇస్తారు..?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి నెలన్నర గడుస్తోంది. అయితే.. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగుల పింఛను రూ.6,000 చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల వేళ చెప్పినట్లు ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెంచి ఇస్తారా అని ఆశగా ఉన్నారు. జనవరి నెలలో పెన్షన్లను పెంచి అందిస్తారని భావించారు. కానీ.. ఈ నెల కూడా అది జరగడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆసరా పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో.. పాత పద్ధతిలోనే విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రెండుమూడు రోజుల్లో పెన్షన్ డబ్బులను అందించనున్నారు. ప్రస్తుతం పెన్షన్ రూ.2,016, దివ్యాంగులకు పెన్షన్ రూ.3,016 అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాధారణ పెన్షన్ రూ.4వేలు, దివ్యాంగులకు ఇచ్చేపెన్షన్ రూ.6వేలు ఇస్తామని చెప్పారు. ఆ హామీ ఎప్పటి నుంచి అమలు అవుతుందో తెలియకపోవడంతో ఇటు లబ్ధిదారులు ఆశగా ఉంటే.. ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో పాత తరహాలోనే పెన్షన్లు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు.
ఫిబ్రవరి లేదా మార్చి నుంచే పెన్షన్ పెంపు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా ప్రసన్తుతం 15,98,729 మంది వృద్ధులు ఉండగా.. 15,60,707 మంది వితంతువులు, దివ్యాంగులు 5,03,613 మంది ఉన్నారు. ఇక బీడీ కార్మికులకు 4,24,585, ఒంటరి మహిళలు 1,42,394 మంది ఉన్నారు. గీత కార్మికులు 65,307, చేనేత కార్మికులు 37,145, హెచ్‌ఐవీ బాధితులు 35,998 ఉన్నారు. ఇలా మొత్తం వివిధ వర్గాల కింద పెన్షన్లు తీసుకునేవారు మొత్తం 43,96,667 మంది ఉన్నారు. వీరికి పెన్షన్లు ఇవ్వడానికి ప్రతి నెలా ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు ఇటీవల ప్రజాపాలన కార్యక్రమం ద్వారా పెన్షన్ల ఇంకా కొన్ని దరఖాస్తులు వచ్చాయి. వివిధ పెన్షన్ల కోసం 24.84 లక్షల దరఖాస్తులు వచ్చాయని అదికారులు చెప్పారు. ఇక వీటన్నింటినీ కలుపుకొని అప్‌డేట్ చేస్తే మొత్తం పెన్షన్లు తీసుకునేవారు 69లక్షలకు పెరగనుంది.