Telangana Polls: మునుగోడులో అభివృద్ధి ఎక్కడ..? ఈ సారి ప్రజల మాటేంటి..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.
By Srikanth Gundamalla Published on 22 Nov 2023 6:45 AM ISTTelangana Polls: మునుగోడులో అభివృద్ధి ఎక్కడ..? ఈ సారి ప్రజల మాటేంటి..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. గతేడాదే ఉపఎన్నికలు జరిగాయి. ఏడాది తిరక్కముందే మరోసారి ఎన్నికలు వచ్చాయి. దాంతో.. అక్కడ ఎన్నికల జాతర కొనసాగుతున్నట్లుగా ఉంది. మునుగోడు నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలు పక్కనపెడితే.. అభివృద్ధి మాత్రం పెద్దగా లేదంటున్నారు అక్కడి ప్రజలు. కొందరు ఇటు అధికార పార్టీపై అసంతృప్తిగా ఉంటే.. ఇంకొందరు ప్రతిపక్ష కాంగ్రెస్‌పైనా విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా మునుగోడులో ఎన్నికల గురించి ప్రజలు ఏమంటున్నారనే దానిపై న్యూస్‌మీటర్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్.
మునుగోడు నియోజకవర్గం:
నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మునుగోడు నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు, నాంపల్లి, చండూరు, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2.14 లక్షలకు పైగా మంది ఓటర్లు ఉన్నారు. ఇదరు 1.21 లక్షల మంది పురుష ఓటర్లు ఉండగా.. 1.20 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మునుగోడు నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. అయితే.. 2022లో జరిగిన ఉపఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిపై కూసుకుంట్ల గెలుపొందారు. అయితే.. ఏడాది తిరక్కముందే శాసనసభ ఎన్నికలు రావడంతో ఇక్కడ ఓట్ల జాతర కొనసాగుతున్నట్లు ఉంది.
మునుగోడు రాజకీయం:
మునుగోడు నియోజకవర్గం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాయకులు పార్టీ మారడం.. కొందరు నేతలు సొంత గూటికి చేరడంతో రసవత్తరంగా సాగింది సీట్ల కేటాయింపు కూడా. అయితే.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉపఎన్నికకు ముందు బీజేపీలో చేరారు. ఆ పార్టీ నుంచే పోటీ చేశారు. అయితే.. ఉపఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి పరాభవం ఎదురైంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ తన సొంతగూటికి చేరుకున్నారు. దాంతో.. కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయతీ షురూ అయ్యింది. అప్పటికే కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి టికెట్ ఆశించారు. కానీ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనకే మొగ్గు చూపింది కాంగ్రెస్ అధిష్టానం.
కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి, అలాగే చలమల కృష్ణారెడ్డి.. అది జరగకపోవడంతో అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్‌లో చేరారు. అలాగే.. చలమల కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తామని బీజేపీ హామీ ఇవ్వడంతో ఆయన కమలం కండువా కప్పుకున్నారు. చివరకు కాంగ్రెస్ నుంచి బరిలో రాజగోపాల్‌రెడ్డినే బరిలోకి దిగారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి.. తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదంటూ రాజీనామా చేస్తే.. ఎన్నికలు వస్తేనే నిధులు కేటాయిస్తారంటూ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. అయితే..బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ ఆ ఎన్నికల్లో గెలిచారు.
మునుగోడులో వామపక్షాలకూ బలం:
మునుగోడు నియోజకవర్గంలో వామపక్షాలకు కాస్త బలం ఉందనే చెప్పాలి. ఇక్కడ వారికి ఓట్లు ఉన్నాయి. ఒకప్పుడు 1985, 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో వరుసగా సీపీఐ అభ్యర్థి గెలిచారు. మూడుసార్లు ఉజ్జిని నారాయణరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక మరోసారి వరుసగా 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు సీపీఐ అభ్యర్థులే గెలిచారు. అంటే ఇక్కడ వామపక్షాలకూ ఓట్లు ఉన్నాయనే కొందరు అంటున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం మునుగోడు అభ్యర్థిగా నర్సిరెడ్డిని ప్రకటించారు. సీపీఐ మాత్రం కాంగ్రెస్‌కే మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో వామపక్షాలకు పడే ఓట్లు కొంత మేరకు కాంగ్రెస్‌కే వెళ్తాయి. అంతేకాదు.. గత 2022 ఉపఎన్నికల్లో మునుగోడులో బీఆర్ఎస్ గెలవడానికి వామపక్షాలకే కారణమని చెప్పాలి. అప్పట్లో బీఆర్ఎస్‌కు వామపక్ష పార్టీలు మద్దతు ఇవ్వడంతో కూసుకుంట్లకు మెజార్టీ వచ్చింది.
మునుగోడులో ప్రధాన పార్టీల అభ్యర్థులు:
మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ గూటికి చేరిన రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీ నుంచే బరిలోకి దిగుతున్నారు. బీజేపీ మునుగోడు అభ్యర్థిగా.. ఇటీవల కాంగ్రెస్ నుంచి కమలం కండువా కప్పుకున్న చలమల కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. కాస్తో కూస్తో బలం ఉన్న మునుగోడు నియోజకవర్గం నుంచి సీపీఎం కూడా పోటీ చేస్తోంది. ఆ పార్టీ నుంచి నర్సిరెడ్డిని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. బీఆర్ఎస్‌లో చేరిన పాల్వాయి స్రవంతి కేడర్ కూసుకుంట్లకు సపోర్ట్ చేస్తోంది. మరోవైపు రాజగోపాల్‌రెడ్డి ఈ నియోజకవర్గంలో మంచి ఫేమ్ ఉంది. అదీకాక కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఈ మధ్య వరుసగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డికి కూడా బలం మరింత ఎక్కువైందనే చెప్పాలి. సీపీఐ కూడా రాజగోపాల్‌రెడ్డికి మద్దతు తెలపడం ఆయన గెలుపునకు శుభసూచకంగా భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా చలమల కృష్ణారెడ్డి కూడా తన శైలిలో ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
మునుగోడులో అభివృద్ధిపై ప్రజల మాటేంటి అంటే..
మునుగోడులో అభివృద్దిపై ప్రజలు అంత సంతృప్తిగా లేరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తమ వద్ద పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగలేదంటున్నారు. కొన్ని గ్రామాల మధ్య రోడ్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని చెప్పారు. 2022 ఉపఎన్నిక తర్వాత ఏదో నామమాత్రంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వేశారని.. కానీ ఇంకొన్ని అలాగే వదిలేశారని అంటున్నారు. మరోవైపు శివన్నగూడెం రిజర్వాయర్ ప్రాజెక్టు పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని అక్కడి ప్రజలు అంటున్నారు. భూనిర్వాసితులు కూడా అధికార యాంత్రాంగం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 2015లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారనీ.. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదంటున్నారు.
ఇక మునుగోడు పట్టణం అయితే అభివృద్ధికే నోచుకోవడం లేదని అక్కడి స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పేరుకే నియోజకవర్గం అయినా ఇక్కడ కాలేజీ కూడా లేదని అంటున్నారు. స్కూల్ తర్వాత పిల్లలు చదువుకోవడానికి జిల్లా కేంద్రానికే వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఇక్కడ వైద్య సదుపాయాలు కూడా సరైన విధంగా లేవని అంటున్నారు. మునుగోడులో ఎప్పుడో తెలంగాణ ఏర్పడక ముందు కట్టించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందనీ.. అందులోనూ సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు. మంచి చికిత్స అందాలంటే నల్లగొండకు వెళ్తున్నామని వెల్లడించారు.
మరికొందరు అయితే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇస్తున్నదేమో కానీ.. పన్నుల రూపంలో తమ దగ్గర నుంచి తీసుకుంటున్నదే ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలూ తమకు అందడం లేదని.. అధికార పార్టీ శ్రేణులకే ఫలాలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇక మరికొందరు మాత్రం గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇప్పుడు సంతోషంగా ఉన్నామని అంటున్నారు. రైతుబంధు వంటి పథకాలతో ప్రభుత్వం సాయం నిలుస్తోందని అంటున్నారు.
మొత్తంగా మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి పెద్దగా జరగలేదనే అంటున్నారు అక్కడి ప్రజలు. కొందరు రైతులు, వృద్ధులు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే తమకు సాయంగా ఉంటారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడులో ఉపఎన్నిక రసవత్తరంగా ఉండనుందని తెలుస్తోంది. ప్రజలు ఎవరికి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారో చూడాలి.