నల్లగొండ - ఖమ్మం - వరంగల్ స్థానం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా మెజార్టీ సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై గెలుపొందారు. తద్వారా తన సిట్టింట్ స్థానాన్ని టీఆర్ఎస్ మరోసారి గెలుచుకున్నట్లయింది. కాగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నల్లగొండ జిల్లాలో విషాదాన్ని నింపాయి. మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేని నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లంకలపల్లి గ్రామానికి చెందిన ఏర్పుల శ్రీశైలం(21) ఆదివారం ఉదయం పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు. ఇక ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి శ్రీశైలం మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. తీన్మార్ మల్లకు మద్దతుగా శ్రీశైలం ప్రచారం చేశాడు. అయితే.. ఎన్నికల్లో మల్లన్న ఓటమి పాలు కావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీశైలం ఆత్మహత్య విషయం తెలుసుకున్న తీన్మార్ మల్లన్న విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని మల్లన్న విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం కుటుంబానికి అండగా ఉంటామన్నారు.