కేంద్రమంత్రి బండి సంజయ్‌పై ధిక్కార చర్యలు తీసుకోండి: సుప్రీంకు కేటీఆర్‌ విజ్ఞప్తి

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు.

By అంజి  Published on  27 Aug 2024 10:30 AM GMT
contempt action, Union Minister Bandi Sanjay, KTR appeals, Supreme Court

కేంద్రమంత్రి బండి సంజయ్‌పై ధిక్కార చర్యలు తీసుకోండి: సుప్రీంకు కేటీఆర్‌ విజ్ఞప్తి

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. బాధ్యతాయుతమైన హోంశాఖ సహాయమంత్రిగా ఉండి సుప్రీంకోర్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించాలి. ఈయనపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతున్నా అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. క్రైమ్‌, వైన్‌, డైన్‌లో భాగస్వామ్యులైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల అలుపెరగని ప్రయత్నాలు ఫలించాయని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. బెయిల్‌ కోసం పోరాడిన కాంగ్రెస్‌ తరఫు న్యాయవాదులకు శుభాకాంక్షలు అని అన్నారు. కవిత బెయిల్‌పై బయటకు రావడం, ఈ కేసును వాదించిన లాయర్‌ రాజ్యసభకు ఎన్నిక కావడంలో కేసీఆర్‌ చతురత ప్రదర్శించారని బండి సంజయ్‌ సెటైర్లు వేశారు.

కవితకు బెయిల్‌ రావడంతో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీతో బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు కావడంతోనే కవితకు బెయిల్‌ వచ్చిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అటు బీజేపీ నేతలు.. కవితకు బెయిల్‌ ఇప్పించిన కాంగ్రెస్‌ పార్టీకి కంగ్రాట్స్‌ అని ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఇరు వర్గాలు పోటాపోటీగా ట్వీట్లు చేసుకుంటున్నాయి.

Next Story