మృతదేహానికి వైద్యం.. సినిమా సీన్ రిపీట్
Tagore Movie scene repeats in a Private Hospital in Amangallu.గర్భిణికి చేసిన శస్త్రచికిత్స వికటించి మృతి చెందింది.
By తోట వంశీ కుమార్ Published on 8 Sept 2022 12:43 PM ISTగర్భిణికి చేసిన శస్త్రచికిత్స వికటించి మృతి చెందింది. అయితే.. ఆ విషయాన్ని దాచి ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ మెరుగైన వైద్యం అందించాలని మృతదేహాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులను నమ్మించారు. ఈఘటన రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్లు పట్టణంలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా బుధవారం విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. తలకొండపల్లి మండల పరిధిలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళకు పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఆమనగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయగా.. మగబిడ్డకు జన్మనిచ్చింది. కొద్ది సేపటి తరువాత ఆ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మరణించింది.
అయితే.. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పకుండా వైద్యులు కొత్త డ్రామాకు తెరతీశారు. మహిళ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు మెరుగైన వైద్యం అందుతోందని, కోలుకుంటుందని చెప్పారు. కొద్దిసేపటి తరువాత మృతి చెందిందని తెలిపారు.
బాధితురాలి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి నిలదీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.8లక్షలు ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం కాళ్ల బేరానికి వచ్చింది. ఈమేరకు ఒప్పంద పత్రం రాసి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా..దీనిపై ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.