ఆస్తి పంపకాల కోసం గొడవ.. మూడ్రోజులుగా ఫ్రీజర్‌లోనే తల్లి మృతదేహం
మానవ సంబంధాలు రోజురోజుకి క్షీణించిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 17 May 2024 2:11 PM ISTఆస్తి పంపకాల కోసం గొడవ.. మూడ్రోజులుగా ఫ్రీజర్‌లోనే తల్లి మృతదేహం
మానవ సంబంధాలు రోజురోజుకి క్షీణించిపోతున్నాయి. కుటుంబ సభ్యుల కన్నా.. కన్నవారికన్నా కొందరికి ఆస్తులే ఎక్కువయిపోతున్నాయి. ఆస్తుల పంపకాల్లో గొడవలు పెట్టుకుని దారుణ సంఘటనలకు ఒడిగడుతున్నారు. అన్నదమ్ముళ్లు దూరంగా ఉండటం.. హత్యలకు పాల్పడటం వంటివి కూడా చూశాం. కానీ.. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఆస్తి పంపకం కోసం తల్లి అంత్యక్రియలను కూడా నిర్వహించడం లేదు ఒక వృద్ధురాలి సంతానం. వారు వ్యవహరిస్తున్న తీరుపై బంధువులే కాదు.. గ్రామస్తులంతా మండిపడుతున్నారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారి గూడెంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఉంటుంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. ఒక కుమారుడు చాలా కాలం క్రితమే చనిపోయాడు. అయితే.. లక్ష్మమ్మ వయసు 80 ఏళ్లు దాటిపోయింది. ఆమె అనారోగ్యానికి గురైంది. ఈ క్రమంలోనే ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతు ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి కందులవారి గూడెంకు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే కొడుకు, ముగ్గురు కూతుళ్ల మధ్య ఆస్తి పంకపాల గొడవ మొదలైంది. లక్ష్మమ్మ పేరు మీద రూ.21 లక్షల ఆస్తులు ఉన్నాయి. 20 తులాల బంగారం కూడా ఉంది.
అయితే.. రూ.21 లక్షల్లో వైద్యం ఖర్చులు పోను రూ.15 లక్షలు మిగిలాయి. వాటిని కొడుకు తీసుకున్నాడు. ఇక 20 తులాల బంగారం కూతుళ్లు తీసుకునేందుకు ఒప్పందం కుదిరింది. కానీ చివరి క్షణంలో కొడుకు కండీషన్ పెట్టాడు. అంత్యక్రియల ఖర్చు కూడా సమానంగా భరించాలని చెప్పాడు. దాంతో.. గొడవ మొదలు అయ్యింది. దాదాపు మూడ్రోజులు కావొస్తున్నా అది ఇంకా తేలలేదు. పెద్దల ముందు పంచాయితీ పెట్టగా.. ఎవరూ తగ్గలేదు. దాంతో.. లక్ష్మమ్మ అంత్యక్రియలు నిలిచిపోయాయి. మూడ్రోజులుగా ఆమె మృతదేహం ఫ్రీజర్‌లోనే ఉండిపోయింది. డెడ్‌బాడీ ఇంకా ఇంట్లోనే ఉండిపోయింది. కుటుంబ సభ్యుల తీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు. దహనసంస్కారాలు చేయకుండా ఎన్నిరోజులు ఉంచుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.