ఎస్సీ, ఎస్టీల వర్గీకరణపై సుప్రీం తీర్పు.. మందకృష్ణ భావోద్వేగం
ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్వాగతించారు.
By అంజి Published on 1 Aug 2024 7:25 AM GMTఎస్సీ, ఎస్టీల వర్గీకరణపై సుప్రీం తీర్పు.. మందకృష్ణ భావోద్వేగం
ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్వాగతించారు. 30 ఏళ్ల పోరాటం ఫలించిందని భావోద్వేగానికి గురయ్యారు. వర్గీకరణ కోసం ప్రధాని మోదీ చొరవ చూపారని తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ బాధ్యతను భుజాన వేసుకున్నారన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన చట్టం వల్లే న్యాయం బతికిందని పేర్కొన్నారు.
ఈ విజయాన్ని అమరులకు, ఉద్యమకారులకు అంకితం ఇస్తున్నామన్నారు. న్యాయం, ధర్మం కోసం చేసిన పోరాటం ఫలించిందని సుప్రీంకోర్టు తీర్పును ఉద్దేశించి మందకృష్ణ మాదిగ అన్నారు. మాల సోదరులు అధైర్యపడొద్దని, అందరినీ కలుపుకొని పోతామని చెప్పారు. రిజర్వేషన్ల వ్యవస్థ రెండో అడుగు వేయబోతుందని, అన్యాయానికి గురైన వర్గాల వైపే న్యాయస్థానం నిలబడిందని తెలిపారు. వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణను అప్పటి సీఎం చంద్రబాబే చేశారని ఎంఆర్‌పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గుర్తు చేశారు. అప్పట్లో చంద్రబాబు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు తమ వాళ్లకు వచ్చేవి కాదన్నారు. ఆ రోజు ఆయన తీసుకొచ్చిన కొత్తం చట్టం వల్లే న్యాయం బతికిందన్నారు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నారని, వర్గీకరణ అమలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మందకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.