ఆసిఫాబాద్ : చిన్నారి చదువుల తల్లికి కష్టం వచ్చింది. చిత్రంలోని చిన్నారి పేరు సరస్వతి విద్య. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మొర్రిగూడలోని గిరిజన కుటుంబానికి చెందిన కుడిమెత భగవంతరావు కూతురు. బాలిక మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. సాక్షాత్తూ చదువుల తల్లిని తన పేరులో నిలుపుకొన్న ఈ చిన్నారికి చదువంటే అమితమైన ఇష్టం.
కానీ, కరోనా వల్ల తను చదివే పాఠశాలను మూసివేసి, ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు. అయితే, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన మొర్రిగూడలో ఏ మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ అందవు. దీంతో సరస్వతి విద్యను తండ్రి ఇదిగో ఇలా ప్రతిరోజూ ఐదు కిలోమీటర్ల దూరంలో.. సిగ్నల్ వచ్చే ప్రాంతానికి బైక్‌పై తీసుకెళ్లి క్లాసులు అయిపోగానే తిరిగి ఇంటికి తీసుకెళ్తున్నాడు.