మంచిర్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. దోరగారిపల్లేలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తేజశ్విని.. ఇవాళ విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం తేజశ్విని మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇవాళ విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్‌లో 60.01 శాతం, సెకండీయర్‌లో 64.19 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులు తమ ఫలితాలను టీఎస్‌బీఐఈ అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు నిర్వహించిన పరీక్షలకు మొత్తం 980,978 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 478,718 మంది ప్రథమ, 502,260 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు ఉన్నారు.