తెలంగాణ తల్లి విగ్రహాన్ని కింద పడేశారు అనే తప్పుడు ప్రచారంపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ వివరణ ఇచ్చింది. భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ వేదికగా అన్ని జిల్లాల కలెక్టరేట్లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి వర్చువల్‌గా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఆ సందర్భంలో 12 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ప్రభుత్వం ఆర్ అండ్ బి శాఖ తరుపున తాత్కాలికంగా ఏర్పాటు చేసింది.
భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కోసం వేసిన తాత్కాలిక నిర్మాణాలు తొలగిస్తున్న నేపథ్యంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడి నుండి తరలించే ప్రక్రియలో భాగంగా విగ్రహానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా భద్రంగా పక్కకు వాల్చి క్లాత్ ర్యాపింగ్ చేశాం. విగ్రహాన్ని పక్కకు వాల్చిన సందర్భంలో ఎవరో దురుద్దేశపూర్వకంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేస్తూ యావత్ తెలంగాణ సమాజాన్ని తప్పు దోవ పట్టిస్తు, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఎలాంటి అగౌరవం జరగలేదు. భద్రంగా ర్యాపింగ్ చేసి గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ వర్క్ షాప్ కు తరలించాం. ఇట్టి అసత్యపు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం..అని రోడ్లు భవనాలు శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.