ఆర్మీ జవాన్‌ అయితేనేం లంచం ఇవ్వాల్సిందే.. సైనికుడి సెల్ఫీ వీడియో

కొన్ని రెవెన్యూ ఆఫీసుల్లో ఏదైనా పని కోసం వెళ్తే లంచం అడుగుతుంటారు కొందరు అవినీతి అధికారులు.

By Srikanth Gundamalla  Published on  9 March 2024 8:03 AM IST
bribe ,  army jawan,  tehsildar office, telangana,

ఆర్మీ జవాన్‌ అయితేనేం లంచం ఇవ్వాల్సిందే.. సైనికుడి సెల్ఫీ వీడియో 

కొన్ని రెవెన్యూ ఆఫీసుల్లో ఏదైనా పని కోసం వెళ్తే లంచం అడుగుతుంటారు కొందరు అవినీతి అధికారులు. ఏసీబీ అధికారులకు ఇలాంటి వారు పట్టుబడుతున్నా అవినీతి అధికారులకు మాత్రం బుద్ధి రావడం లేదు. తాజాగా రంగారెడ్డి జల్లా కొందుర్గు మండలంలో కూడా ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ ఆర్మీ జవాన్‌ పొలాని సంబంధించిన పహణీల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పని పూర్తిచేయాలంటే డబ్బులు ఇవ్వాలని తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది చెప్పారు. తాను ఆర్మీ జవాన్‌ను అని చెబితే.. ఆర్మీ జవాన్ అయితేనేం లంచం ఇవ్వాల్సిందే అనిచెప్పారట. స్వయంగా తనకు ఎదురైన అనుభవాన్ని ఆ ఆర్మీ జవాన్‌ సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం విశ్వనాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన అశోక్‌రెడ్డి కశ్మీర్ సరిహద్దులో పనిచేస్తున్నాడు. సెలవుపై అశోక్‌రెడ్డి తన స్వగ్రామానికి వచ్చాడు. తన గ్రామంలో ఉన్న పొలానికి సంబంధించి ఆర్ఓఆర్, పహాణీల కోసం తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే.. ఈ పని పూర్తి చేయాలంటే రూ.40వేలు చెల్లించాలంటూ పనిచేసే సిబ్బంది చెప్పారనీ అశోక్‌రెడ్డి తెలిపాడు. దేశరక్షణ కోసం తాను సరిహద్దుల్లో పనిచేసే ఆర్మీ జవాన్‌ను.. తన వద్ద కూడా లంచం తీసుకుంటారా అని ప్రశ్నించగా.. ఆర్మీ జవాన్ అయినా ఎవరైనా సరే లంచం ఇవ్వాలని సిబ్బంది చెప్పినట్లు వీడియోలో పేర్కొన్నాడు అకోశ్‌ రెడ్డి. తమతో పాటు అధికారులు కూడా ఈ లంచంలో వాటా తీసుకుంటారని సిబ్బంది చెప్పినట్లు తెలిపారు.

చేసేదేం లేక తన పని పూర్తి చేసుకోవడం కోసం రూ.30వేలు చెల్లించినట్లు ఆర్మీ జవాన్ అశోక్‌ రెడ్డి తెలిపాడు. డబ్బులు చెల్లించిన తర్వాతే సర్టిఫికెట్లు అందించారని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన తహసీల్దార్‌ బాధ్యులైన ఉద్యోగులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Next Story