Bhadrachalam Sri RamaNavami : కనులపండువగా భద్రాద్రి రాములోరి కల్యాణం
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది
By తోట వంశీ కుమార్ Published on 30 March 2023 12:36 PM ISTనులపండువగా భద్రాద్రి రాములోరి కల్యాణం
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. ఉదయం 10.30 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభమైంది. వేదపండితులు రాములోరి కల్యాణ విశిష్టతతో పాటు, భద్రాద్రి ఆలయ చరిత్ర, వైభవాన్ని భక్తులకు వివరించారు. భద్రాచలం ఆలయం ఆరుబయట మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు.
అభిజిత్ లగ్నంలో రామయ్య, సీతమ్మ లు ఒక్కటి అయ్యారు. వేదమంత్రోచ్చరణల నడుమ సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామ నామస్మరణతో మిథిలా స్టేడియంతో పాటు, భద్రాద్రి పుర వీధులు మార్మోగుతున్నాయి.
సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ రవించంద్ర తదితరులు రాములోరి కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చారు.
భక్తజనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వేసవి దృష్ట్యా మిథిలా మైదానంలో చలువ పందిళ్లు వేశారు. ఫ్యాన్లు, కూలర్లు అమర్చారు. భక్తులు కూర్చొని వీక్షించేలా ఏర్పాటు చేశారు. మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 2వేలకు పైగా పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాటు చేశారు.