భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తుల జయజయద్వానాల మధ్య మిథిలా మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై అర్చకులు కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరుపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు, ముత్యా తలంబ్రాలను సమర్పించారు.
కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల పాటు స్వామి వారి కల్యాణానికి భక్తులను అనుమతించలేదు. ఈ సారి కరోనా తగ్గుముఖం పట్టడంతో భక్తులను అనుమతించారు. రాములోరి కల్యాణోత్సవానికీ భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం, ఆలయ వీధులు భక్తజనసందోహంగా మారాయి. శ్రీరామ నామస్మరణతో భద్రగిరి మారుమ్రోగుతున్నది. ఇక భక్తులకు పంపిణీ చేసేందుకు వీలుగా రెండు లక్షల ప్యాకెట్ల స్వామి వారి తలంబ్రాలను అధికారులు సిద్దం చేశారు. కల్యాణోత్సవం పూర్తికాగానే భక్తులకు వీటిని అందజేయనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.