హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) వివిధ ప్రాంతాల మధ్య దాదాపు 620 ప్రత్యేక రైళ్లను రెండు తెలుగు, ఇతర పొరుగు రాష్ట్రాలకు నడపాలని నిర్ణయించింది. దసరా పండుగకు ఇంటికి వెళ్లాలని లేదా చిన్న ట్రిప్‌కు వెళ్లాలని అనుకున్న వారికి ఇది శుభవార్త. అక్టోబర్ 24, మంగళవారం నాడు వచ్చే ఈ దసరా సందర్భంగా ప్రజల ప్రయాణాన్ని ఇబ్బంది లేకుండా చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లితో సహా హైదరాబాద్ మహా నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల నుండి ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ప్రత్యేక రైళ్లలో స్లీపర్ క్లాస్, సెకండ్ సీటింగ్, AC II టైర్, AC III టైర్ సీట్లు, ప్రజల భద్రత కోసం CCTV ఉన్నాయి.
రాత్రి సమయంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) నేరాలు జరిగే ప్రాంతాలు, ప్రధాన జంక్షన్‌లలో రైళ్లను ఎస్కార్ట్ చేస్తుందని, సహాయం అవసరమైన ప్రయాణికులు ఎప్పుడైనా సిబ్బందిని సంప్రదించవచ్చని సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. దసరా పండుగ సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని 'భారత్ గౌరవ్ టూరిస్ట్' రైళ్లను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ పండుగ మాసంలో కాశీ, పూరి, అయోధ్య, రామేశ్వరం మొదలైన పవిత్ర స్థలాలకు రెండు 'భారత్ గౌరవ్' రైళ్లు ప్రయాణిస్తాయి. కాగా ప్రయాణికుల సౌకర్యార్థం తగిన సిబ్బందితో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.