సాధారణంగా ఎవరికైన ఒక్క పామును చూస్తేనే భయం కలుగుతుంది. అలాంటిది ఏకంగా 30కిపైగా పాము పిల్లలు ఓ అంగన్ వాడీ కేంద్రంలో బయటపడడం కలకలంరేపింది. మహాబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కొత్తపల్లిలోని అంగన్ వాడీ కేంద్రంలో పాము పిల్లల కలకలం సృష్టించాయి. సోమవారం అంగన్‌వాడీ సెంటర్ కార్యకర్త శ్రీ జ్యోతి, ఆయా లచ్చమ్మ చిన్నారులతో పాటు గర్భిణులకు సరకులు పంచేందుకు భవనం తెరిచారు. ఆ సమయంలో రెండు, మూడు పాము పిల్లలు కనిపించాయి. వెంటనే వారు విషయాన్ని స్థానికులకు చెప్పారు. వెంటనే వాటిని చంపారు. ఇంకా ఏమైన పాము పిల్లలు ఉన్నాయోమోనని అనుమానంతో బండను పక్కకు జరిపి చూడగా.. పెద్ద సంఖ్యలో పాము పిల్లలు బయటకు వచ్చాయి.
వాటినన్నింటిని చంపేశారు. దాదాపు 30పైగా పాములు, రెండు తేళ్లు బయటపడ్డాయి. కాగా.. ఈరోజు మంగళవారం సైతం మరిన్ని పాములు బయటకు వస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంగన్ వాడీ భవనం శిథాలావస్థకు చేరుకుందని అందుకనే పాములు, తేళ్లు వస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు. వెంటనే నిధులు మంజూరు చేసి కొత్త భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సమయానికి ఆ గదిలో పిల్లలు లేకపోవడంతో పెద్ద పెను ముప్పు తప్పిందని గ్రామస్తులు చెబుతున్నారు.