SLBC దుర్ఘటన..సహాయక చర్యల పూర్తి కోసం టెక్నికల్ కమిటీ ఏర్పాటు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలను పూర్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది.
By Knakam Karthik
SLBC దుర్ఘటన..సహాయక చర్యల పూర్తి కోసం ఆ కమిటీ ఏర్పాటు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలను పూర్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు కమిటీ ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ కమాండెంట్, ఎన్జీఆర్ఐ డైరెక్టర్, జీఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఎన్సీఎస్ డైరెక్టర్, బీఆర్వో, కల్నల్ పరీక్షిత్ మెహ్రా, తెలంగాణ పీసీసీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అదనపు డీజీ, సీడీవో సీఈ, నాగర్ కర్నూలు కలెక్టర్, ఎస్పీ, ఎస్ఎల్‌బీసీ చీఫ్ ఇంజినీర్, సంబంధిత నిపుణులు ఈ సాంకేతిక కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఎస్ఎల్‌బీసీ సొరంగంలోని చివరి 30 నుంచి 50 మీటర్ల మేర ఉన్న రాతి పొరల స్థితి ప్రమాదకరంగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టవద్దని జీఎస్ఐ సూచించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అనుసరించాల్సిన కార్యాచరణ, వ్యూహాల రూపకల్పనకు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. తదుపరి ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆ ప్రాంతంలో చిక్కుకున్న ఆరుగురి కోసం చేపట్టాల్సిన సహాయక చర్యల కోసం సాధ్యమయ్యే వివిధ అవకాశాలను పరిశీలించేందుకు నిపుణలతో కూడిన సాంకేతిక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
నిర్దిష్ట గడువులోగా ఆరుగురు కార్మికుల మృతదేహాలను వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించేలా కమిటీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సహాయక చర్యల్లో ఎటువంటి ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిటీ సూచనలు చేయాల్సి ఉంటుంది. ఎస్ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం సుమారు రెండు నెలలుగా సహాయక చర్యలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.