ఎన్నికల్లో అవకతవకలు.. డ్రోన్లతో సిద్దిపేట పోలీసుల నిఘా
అభ్యర్థులు మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఉదంతాలను తనిఖీ చేసేందుకు సిద్దిపేట పోలీసులు 10 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
By అంజి Published on 29 Nov 2023 12:45 PM ISTఎన్నికల్లో అవకతవకలు.. డ్రోన్లతో సిద్దిపేట పోలీసుల నిఘా
సిద్దిపేట: అభ్యర్థులు మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఉదంతాలను తనిఖీ చేసేందుకు సిద్దిపేట పోలీసులు 10 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించబడిన వీడియోలను సంబంధిత ఎస్‌హెచ్‌ఓలు, డిఎస్పీలు, పోలీసు కమిషనర్ ఎన్ శ్వేత పర్యవేక్షిస్తారు. ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించి సమాచారం అందిన తర్వాత నిమిషాల వ్యవధిలో పోలీసులు చర్యలు తీసుకునేలా ఈ వ్యవస్థనను ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు.
పోలింగ్ సజావుగా జరిగేందుకు జిల్లా వ్యాప్తంగా కేంద్ర బలగాలతో సహా 2,632 మంది సిబ్బందిని మోహరించారు. బుధ, గురువారాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి లోగోలు, బ్యానర్లు ధరించవద్దని రాజకీయ పార్టీలను ఆమె కోరారు. మద్యం, కల్లు, డబ్బు ఇస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఏ పార్టీ ప్రయత్నించినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఏదైనా రూపంలో చిహ్నాలు లేదా లోగోలను ప్రదర్శించడం ద్వారా మతపరమైన హింసను సృష్టిస్తే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని కమిషనర్ తెలిపారు.
బయటి వ్యక్తులను కూడా వెంటనే జిల్లా వదిలి వెళ్లాలని కమిషనర్ ఆదేశించారు. పోలింగ్ సజావుగా సాగేందుకు తాము సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు, పౌరులు తమకు సహకరించాలని శ్వేత కోరారు. జిల్లా వ్యాప్తంగా 12 నిఘా బృందాలు తిరుగుతూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. 26 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్‌లు, 12 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు.