హైదరాబాద్: కోడిగుడ్ల ధరలతో పాటు చికెన్ ధరలు కూడా ఆకాశనంటుతున్నాయి. తాజాగా కోడిగుడ్లు, చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కార్తీక మాసం తర్వాత నెల రోజుల వ్యవధిలోనే చికెన్ సెంటర్ల నిర్వాహకులు పలు చోట్ల ఏకంగా రూ.100 పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నెల కిందటి వరకు రూ.210 - 220 ఉండగా ఇప్పుడు రూ.300కు చేరింది. న్యూఇయర్ వరకు రూ.330కి చేరవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడం, ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చులు పెరగడమే దీనికి కారణమని అంటున్నారు.
అటు కొండెక్కిన కోడిగుడ్డు ధర
సాధారణంగా రూ.5 ఉండే కోడిగుడ్డు ధర ఇప్పుడు హోల్‌సేల్‌లో రూ.7.30, రిటైల్‌లో రూ.8 మార్క్ దాటేసింది. పౌల్ట్రీ చరిత్రలో ఇలాంటి ధరలు ఎప్పుడూ చూడలేదు. చలికాలంలో గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చులు పెరగడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. గతంలో రోజుకు 8 కోట్లుగా ఉన్న గుడ్ల ఉత్పత్తి తగ్గడమే కాకుండా కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలూ నిండుకున్నాయి. సంక్రాంతి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.