షర్మిల హౌస్‌ అరెస్ట్.. లోటస్‌పాండ్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  18 Aug 2023 10:22 AM IST
Sharmila, House Arrest, Hyderabad, Lotus Pond,

షర్మిల హౌస్‌ అరెస్ట్.. లోటస్‌పాండ్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించేందుకు షర్మిల నిర్ణయించారు. ఈ క్రమంలో గజ్వేల్‌లో పర్యటించేందుకు షర్మిలకు అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను గృహ నిర్బంధం చేశారు. లోటస్‌పాండ్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థుతిలు నెలకొన్నాయి.

గజ్వేల్ నియోజకవర్గంలోని తీగుల్‌ గ్రామంలో ప్రజలు ఇటీవల ఆందోళన చేశారు. దళితబంధు పథకంలో అర్హులకు అన్యాయం చేస్తున్నారని.. అక్రమాలు చేస్తున్నారంటూ ధర్నా చేశారు. సీఎం దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. ఈ క్రమంలో వైఎస్‌ షర్మిల వచ్చి దళితబంధు అక్రమాలపై ప్రశ్నించాలని వారు కోరారు. తీగుల గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు షర్మిల అక్కడకు వెళ్లాలని.. వివరాలు తెలుసుకుని అక్రమాలను బయటపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 18న తీగుల్‌లో పర్యటిస్తానని ప్రకటించారు. షర్మిల ప్రకటనతో బీఆర్ఎస్‌ నాయకులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. దాంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని పోలీసులు అలర్ట్‌ అయ్యారు.

ముందస్తు చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లోనే వైఎస్‌ షర్మిలను హౌజ్ అరెస్ట్‌ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించేందుకు అనుమతి లేదని షర్మిలతో చెప్పారు. బాధితులకు అండగా నిలిచేందుకు మాత్రమే వెళ్తున్నానని.. తనను అడ్డుకోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉందంటూ షర్మిల ఆగ్రమం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లోటస్‌పాండ్‌ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేయగా.. పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు. ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హౌజ్‌ అరెస్ట్‌ గురించి తెలుసుకున్న వైఎస్‌ఆర్‌టీపీ నాయకులు, కార్యకర్తలు లోటస్‌పాండ్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసుల తీరుని తప్పుబడుతున్నారు. పోలీసులు భారీ మోహరించడం, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకోవడంతో లోటస్‌పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story