నిర్మల్ : బాసర ఐఐఐటీ క్యాంపస్‌లో మహిళా కాలేజీ విద్యార్థినులపై సిబ్బంది లైంగిక వేధింపుల ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇద్దరు ఉద్యోగులు విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. దీంతో బాసర ఐఐఐటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఐఐఐటీ క్యాంపస్‌లోని ఇద్దరు ఉద్యోగులు తనను లైంగికంగా వేధించారని ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసింది. అకౌంట్ సెక్షన్ లోని అధికారితో పాటు కిందిస్థాయి ఉద్యోగి తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ విద్యార్ధిని తన ఫిర్యాదులో పేర్కొంది.
బాసర ఐఐఐటీ డైరెక్టర్ సతీష్ ఫిర్యాదును చాలా సీరియస్‌గా తీసుకుని ఘటనపై విచారణకు విచారణ కమిటీని నియమించారు. డైరెక్టర్ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసి వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు చేసిన విద్యార్ధిని తనకు బంధువు అవుతుందని, అందుకే అప్పడప్పుడు పలకరించేవాడినని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరు చెప్పారు. అయితే బాధిత విద్యార్ధిని తమకు బంధువు కాదని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి భార్య అధికారుల రహస్య విచారణలో చెప్పినట్టు సమాచారం.
వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని క్యాంపస్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు, క్యాంపస్‌లో సమస్యలపై విద్యార్థులు నిరసనలు చేయడంతో బాసర ఐఐఐటి వార్తా శీర్షికలలో నిలిచింది.