తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 4లక్షల మందికి గృహలక్ష్మీ
సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేక ఇబ్బందులు పడుతున్న పేదలకు గృహలక్ష్మీ పథకం కింద రూ.3లక్షల ఆర్థిక సాయం
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 9:16 AM IST4లక్షల మందికి గృహలక్ష్మీ
సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గృహలక్ష్మీ పథకం కింద రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 4లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఒక్కొ నియోజకవర్గంలో 3వేల మందికి చొప్పున 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,57,000 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కోటాలో మరో 43 మందికి ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందుకు రూ.12వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్ రావు, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డిలు వివరాలను మీడియాకు వెల్లడించారు.
గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో గృహనిర్మాణ సంస్థ ద్వారా మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులపై రూ.40వేలు, రూ.60వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రూ.4వేల కోట్ల మేరకు అప్పులున్నాయి. వీటిని మాఫీ చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అలాగే.. స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో-58, 59 కటాఫ్ గడువును 2020కి పెంచుతూ నిర్ణయించిన నేపథ్యంలో కొత్తగా దరఖాస్తు చేసుకొనేందుకు మరో నెల సమయం ఇవ్వనున్నారు.
కాశీ, శబరిమల యాత్రికుల కోసం..
తెలంగాణ రాష్ట్రం నుంచి కాశీ, శబరిమల పుణ్యక్షేత్రాలకు పెద్ద ఎత్తున భక్తులు వెలుతుంటారు. ఈ రెండు చోట్ల భక్తుల సౌకర్యార్థం వసతి గృహసముదాయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎస్ శాంతికుమారి కాశీకి వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడి ప్రభుత్వ స్థలం తీసుకుంటారు. ప్రభుత్వ స్థలం దొరకకపోతే ప్రైవేటు స్థలం కొని అన్ని వసతులతో వసతి గృహ సముదాయాన్ని నిర్మిస్తాం. సీఎంవో అధికారి ప్రియాంక వర్గీస్ శబరిమల వెళ్లి అక్కడి ప్రభుత్వం నుంచి స్థలం తీసుకోవాలని సూచించాం. తరువాత మంత్రుల బృందం వెళ్లి పనులు ప్రారంభిస్తుందని చెప్పారు.
ఏప్రిల్ నుంచి గొర్రెల పంపిణీ..
గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా 7.31 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరిలో 50 శాతం మందికి తొలి దశలో పంపిణీ పూర్తి అయ్యింది. మిగిలిన వారికి రెండో విడత కింద ఏప్రిల్ నుంచి పంపిణీ ని ప్రారంభిస్తారు. ఇందుకోసం రూ.4,463 కోట్ల నిధులను విడుదల చేశారు. ఆగస్టు నెలాఖరుకల్లా గొర్రెల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పారదర్శకంగా, వేగవంతంగా ప్రక్రియ జరగాలని ఆదేశించినట్లు తెలిపారు.
హుస్సేన్ సాగర్ తీరంలో నిర్మిస్తున్న దేశంలోనే అతి పెద్దదైన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం పూర్తైంది. ఏప్రిల్ 14న దీన్ని ప్రారంభించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అలాగే ఏప్రిల్ నెలాఖరు నుంచి వడ్ల కొనుగోలు ప్రారంభం అవుతుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సిలకు సంబంధించి మే నెల వరకు సమయం ఉందని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.