టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి శుభవార్త.. ఇక ఆగేది ఉండదు
Separate lanes for TSRTC buses at toll plazas.టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీంచే వారికి శుభవార్త.
By తోట వంశీ కుమార్ Published on 8 Jan 2023 6:05 AM GMTతెలుగు ప్రజలు జరుపుకునే పండుగల్లో సంక్రాంతి అతి పెద్ద పండుగ. అందుకనే చదువుల కోసం,ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వేరే నగరాలకు వలసవెళ్లిన వాళ్లు ఈ పండగకు తప్పనిసరిగా సొంతూళ్లకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఘనంగా పండుగను చేసుకుంటారు. అందరూ ఒకేసారి వెలుతుండడంతో టోల్‌ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది. దీంతో ప్రయాణీకులు ఎక్కువ సమయం అక్కడే నిరీక్షించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) బస్సుల్లో ప్రయాణీంచే వారికి టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే టీఆర్ఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రయాణీకులను త్వరగా వారి గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్ ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులు, టోల్ ప్లాజా నిర్వాహకులకు ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించగా ఇందుకు వారు అంగీకరించారు. దీంతో టీఆర్ఎస్ ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్ ఏర్పాటు కానుంది.
టీఎస్ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్ @TSRTCHQ https://t.co/L60IEcGqYw
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 7, 2023
ఈ నెల 10 నుంచి 14 వరకు హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్ -నిజామాబాద్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్- సిద్దిపేట తదితర జాతీయ రహదారుల్లోని టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక మార్గ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్ కేటాయించడంతో బస్సుల్లో ప్రయాణించే వారికి టోల్‌ప్లాజాల వద్ద ఎక్కువ సేపు నిరీక్షించే సమయం తప్పనుంది. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
తెలంగాణ ఆర్టీసీ 4,233 ప్రత్యేక బస్సులను సంక్రాంతి పండుగ సందర్భంగా నడపనుంది. ముందస్తు టికెట్లు బుకింగ్ చేసుకునే వారికి రాయితీలు కూడా ప్రకటించింది.