లష్కర్ బోనాలు షురూ.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని ప్రభుత్వం తరఫున అమ్మవారికి బోనం సమర్పించారు.
By అంజి Published on 9 July 2023 8:51 AM ISTలష్కర్ బోనాలు షురూ.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానుండటంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత.. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ఆదయ్య నగర్ కమాన్ వద్ద పూజల్లో పాల్గొంటారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అమ్మవారిని దర్శించుకునేలా మొత్తం ఆరు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బాటా చౌరస్తా నుండి ఆలయానికి వచ్చే లైన్, ఎంజీ రోడ్డు రాంగోపాల్‌పేట్ పాత పోలీస్‌స్టేషన్ కొత్త ఆర్చీ గేట్ నుంచి మహంకాళి పోలీస్‌స్టేషన్ మీదుగా ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ జనరల్ బజార్ అంజలి టాకీస్ వైపు నుంచి వీఐపీలకు-1, సాధారణ భక్తులకు-1 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్‌పేట్ పీఎస్ నుంచి సాధారణ భక్తుల క్యూలైన్ ఉంటుంది. డోనర్ పాస్‌ల కోసం ఎంజీ రోడ్డులో ఆలయం వెనక వైపు నుంచి మరో క్యూలైన్ ఉంటుంది.
ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ ఎదురు నుంచి వీవీఐపీలకు అమ్మవారి ఆర్చిగేట్ ద్వారా అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో నిర్వహించే బోనాల పండగ నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం నగరంలో ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 175 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు గాను మహంకాళి పోలీసు స్టేషన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.