సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. పెను విషాదం నింపిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రూబీ మోటార్స్, రూబీ లాడ్జి యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంజిత్ సింగ్ బగ్గా, అతని ఇద్దరు కుమారులపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
సెల్లార్‌లో ఒకేసారి 40 ఎలక్ట్రిక్ బైక్‌లను పార్క్ చేసి ఛార్జింగ్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో బైక్‌లు అన్ని కాలి బూడిద అయ్యాయి. మంటలు చెలరేగడానికి బైక్‌ల చార్జింగే కారమణని బావిస్తున్నారు.
ఎలక్ట్రిక్ బైక్ షోరూం, లాడ్జి యజమానులపై కేసు నమోదు చేసినట్లు మార్కెట్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో వై.నాగేశ్వర్‌రావు తెలిపారు. భవన నిర్మాణంలో కూడా ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. అనుమతించబడిన 15 మీటర్లు (సుమారు 49 అడుగులు) కంటే యజమానులు స్లాబ్‌ను 17.5 మీటర్లు (57 అడుగులు)కి పెంచినట్లు గుర్తించారు.
ప్రమాద సమయంలో 50 మంది అగ్నిమాపక అధికారులు భవనం లోపలికి వెళ్లారు. అయితే.. భవనంలోకి వెళ్లేందుకు మెట్ల మార్గం ఒకటే ఉన్నట్లు గుర్తించారు. మరో మార్గాన్ని మూసివేసి ఉంచారన్నారు. కొద్దిసేపటికే గదుల్లో పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టడం కష్టతరంగా మారింది.
కొందరు భవనంపై నుంచి దూకేందుకు ఇదే కారణమని భావిస్తున్నారు. వివిధ నగరాలకు చెందిన చిరు వ్యాపారులు లాడ్జిలో బస చేశారు.