నిజామాబాద్: గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థిని మృతి
నిజామాబాద్ జిల్లాలో ఏడో తరగతి విద్యార్థిని గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోయింది.
By Srikanth Gundamalla Published on 15 Oct 2023 12:12 PM ISTనిజామాబాద్: గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థిని మృతి
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. చిన్న పిల్లల్లో కూడా హార్ట్ ఎటాక్ వస్తోంది. నడివయసు ఉన్నవారిలోనే గతంలో గుండెపోటు మరణాలు ఉండేవి. కానీ.. అవి ఇప్పుడు పిల్లల్లో కూడా కనిపిస్తుండటంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఏడో తరగతి విద్యార్థిని గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటన స్థానికంగా విషాదం నింపింది.
నిజామాబాద్ జిల్లా కంజర గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు సాయిలక్ష్మికి గ్రెసీ, మైథిలి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్రేసి సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మైథిలీ కూడా అందులోనే ఏడో తరగతి చదువుతోంది. అయితే.. బతుకమ్మ సెలవులు కావడంతో మైథిలకి ఇంటికి వెళ్లింది. అయితే.. శుక్రవారం సాయంత్రం వరకు బాగానే ఆడుకుంది. తర్వాత రాత్రికి ఇంటికి వచ్చి పడుకుంది. ఒక్కసారిగా చాతిలో నొప్పిగా ఉందంటూ తల్లితో చెప్పింది. దాంతో.. మైథిలిని వెంటనే ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే.. చిన్నారి అప్పటికే గుండెపోటుతో మరణించిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అంత చిన్న వయసులో గుండెపోటు రావడం.. ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. శనివారం గ్రామంలో బాలిక అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.
కాగా.. కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లోని సూరత్‌లో 12 ఏళ్ల బాలిక స్కూల్‌లోనే కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారి కూడా గుండెపోటుతోనే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఇలా చిన్నారులతో పాటు ఆరోగ్యం కోసం ఫిట్‌గా ఉండేందుకు ఎక్సర్‌సైజ్‌లు చేసేవారు కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి ఘటన సికింద్రాబాద్‌లో జరిగింది. ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ సడెన్‌గా గుండెపోటుకు గురై చనిపోయిన విషయం తెలిసిందే.