ఓ వైపు రాష్ట్రంలో ప్రెండ్లీ పోలీస్ అని ఉన్నతాధికారులు చెబుతుంటే.. మరోవైపు కొంతమంది పోలీసులు రెచ్చిపోతున్నారు. తమకేమి పట్టనట్లు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా మానవత్వాన్ని మరిచి డ్రైవర్‌పై అమానుషంగా ప్రవర్తించారు పోలీసులు. కాళ్లతో తంతూ.. లాఠీలతో ఇష్టం వచ్చినట్లు కొట్టి చావబాదారు. నన్ను కొట్టొద్దు అంటూ మొరపెట్టుకున్నా కనికరించలేదు.
వివరాళ్లోకెళితే.. సదాశివపేట పోలీసులు స్థానిక అయ్యప్ప స్వామి గుడి వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సదాశివపేటకు చెందిన వాజిద్ బొలేరో వాహనంలో సింగూరుకు కిరాయికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో తనిఖీలు చేస్తున్న ప్రాంతంలో పోలీసులు వాహనం ఆపడంతో వాహనాన్ని కాస్తా దూరంగా తీసుకెళ్లి ఆపాడు వాజిద్. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కానిస్టేబుల్ అతని చేతిలో ఉన్న లాఠీతో చితకబాదాడు. అక్కడితో ఆగకుండా మరో కానిస్టేబుల్ బూటు కాలితో తంతూ.. బండ బూతులు తిట్టాడు. పోలీసుల దాడిలో వాజిద్‌కి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వాజిద్‌ను ఎత్తుకుని పోలీసు స్టేషన్‌కు వచ్చిన స్థానికులు.. స్టేషన్ బయట ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు స్పందించి సదరు పోలీసులు వెంటనే విధుల నుండి తొలగించాలని కోరుతున్నారు.