రేపే యాదాద్రిలో ఉచిత సామూహిక అక్షరాభ్యాసం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమూన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో సామూహిక అక్షర అభ్యాస కార్యక్రమం
By అంజి Published on 9 Jun 2023 8:30 AM ISTరేపే యాదాద్రిలో ఉచిత సామూహిక అక్షరాభ్యాసం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమూన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో సామూహిక అక్షర అభ్యాస కార్యక్రమం జరగనుంది. కొండక్రింద వ్రతమండపం వద్ద సుమారు 100 మంది పిల్లలకు ఉచిత సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి గురువారం తెలిపారు. జూన్ 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.గీత మాట్లాడుతూ.. రోజు 100 మంది చిన్నారులకు కార్యక్రమానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు పిల్లలకు ఎటువంటి రుసుము ఉండదు. తల్లిదండ్రులు జూన్ 9వ తేదీలోగా కొండ గుడి వద్ద ఉన్న రిసెప్షన్ సెంటర్‌లో తమ పిల్లల పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఈవో కోరారు.
యాదాద్రి ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడాన్ని నిషేధించామని ఈవో గీతారెడ్డి తెలిపారు. ఒక వేళ చిత్రీకరణ తప్పనిసరైతే ఆలయం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఏం చిత్రీకరణ చేస్తున్నారో ముందే రాత పూర్వకంగా చెప్పాలని, ఆపై చిత్రీకరణ తర్వాత చూపించాల్సి ఉంటుందన్నారు. తాము సూచించిన నిషేధిత ప్రాంతాలపై చిత్రీకరణ చేయొద్దని, రూల్స్ పాటిస్తేనే షరతులపై డ్రోన్ చిత్రీకరణకు అనుమతి ఇస్తామని చెప్పారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం నిషేధంలో ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు.