హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఇవాళ పూర్తి స్థాయిలో వేతనాలు జమ అవుతాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 1వ తేదీన సాంకేతిక కారణాలతో జీతాలు జమ కాలేదని చెప్పింది. సమస్యలను పరిష్కరించి నిన్నటి నుంచి జమ చేసే ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపింది. పలువురి ఖాతాల్లో గురువారం రాత్రి జమ అయ్యాయి. మిగతా వారికి ఇవాళ డబ్బులు పడనున్నాయి. కాగా జనవరి 1న సెలవు కావడంతో జీతాలు జమ కాలేదనే ప్రచారం జరిగింది.
ఇదిలా ఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రభుత్వం రూ.30 వేల కోట్ల రుణానికి సన్నద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ ఖజానాలో రూ.10వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తాన్ని టీజీఐఐసీకి చెందిన 400 ఎకరాలను తనఖా పెట్టి, సెక్యూరిటీ బాండ్ల ద్వారా తెచ్చిన రుణం ద్వారా సమకూర్చింది. ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడి ఈ నెలలో మరో రూ.10వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వం తీసుకోనుంది. ఇలాగే ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ.10వేల కోట్ల చొప్పున.. మొత్తం ఈ త్రైమాసికంలో రూ.30వేల కోట్ల మేర రుణాలు సేకరించనుంది. వీటిని వివిధ సంక్షేమ పథకాలు, రైతు పథకాల అమలు వినియోగించనుందని సమాచారం.