నల్గొండ, మిర్యాలగూడ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్‌ ఆకస్మిక తనిఖీలు

Sajjanar spot checks at Nalgonda RTC Depot.తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ ఆర్టీసీ) ఎండీ స‌జ్జ‌నార్ శ‌నివారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2021 6:58 AM GMT
నల్గొండ, మిర్యాలగూడ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్‌ ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ ఆర్టీసీ) ఎండీ స‌జ్జ‌నార్ న‌ల్ల‌గొండ‌, మిర్యాల‌గూడ డిపోల్లో ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టారు. శ‌నివారం హైదరాబాద్ నుంచి నల్లగొండకు ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. న‌ల్లొండ బ‌స్టాండ్‌కు చేరుకున్న అనంత‌రం.. ఆయ‌న అక్క‌డ డిపో, బ‌స్టాండ్‌ను ప‌రిశీలించారు. ప్ర‌యాణీకుల‌కు అందుతున్న సౌక‌ర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్క‌డి దుకాణాల‌ల్లో ఎంఆర్‌పీ ధ‌ర‌కే వ‌స్తువుల‌ను విక్ర‌యిస్తున్నారా..? లేదా అనేది ప‌రిశీలించారు. అనంత‌రం అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

అనంత‌రం మీడియాతో స‌జ్జ‌నార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్గో సేవ‌లు మంచి ఫ‌లితాల‌ను ఇస్తున్నాయ‌న్నారు. రైతుల‌కు కూడా కార్గో సేవ‌లు అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. దేశ వ్యాప్తంగా 30శాతం డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో ఆర్టీసీ పెను భారం ప‌డింద‌న్నారు. ఆర్టీసీ బ‌స్సుల్లోనే సుర‌క్షిత ప్ర‌యాణం సాధ్య‌మ‌న్నారు. మారుమూల ప్రాంతాల‌కు సైతం ఆర్టీసీ బ‌స్సు వెలుతోంద‌న్నారు. ఎవ‌రైనా బ‌స్సు సౌక‌ర్యం కోసం త‌న‌కు సోష‌ల్ మీడియాలో విజ్ఞ‌ప్తి చేసినా కూడా వెంట‌నే క‌ల్పిస్తామ‌న్నారు.

ప్ర‌యాణీకుల భ‌ద్ర‌త కోసం అన్ని బ‌స్టాండ్ల‌లో సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు. బ‌స్టాండ్ ఆవ‌ర‌ణ‌లో, బ‌స్సుల‌పై అనుమ‌తి లేకుండా పోస్ట‌ర్లు వేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్‌లో కేసులు న‌మోదు చేసామ‌ని వెల్ల‌డించారు. ఎలాంటి అడ్వాన్స్ లేకుండా ఫోన్ చేస్తే వారి వద్దకే వెళ్లి బస్సు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఆర్టీసీని లాభాల బాట ప‌ట్టించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

Next Story