అన్నదాతలకు శుభవార్త.. త్వరలో రైతుభరోసా రెండో విడత నిధుల విడుదల

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మొదటి దఫా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయగా...

By -  అంజి
Published on : 10 April 2026 6:37 AM IST

Rythu Bharosa Second Installment, Agriculture Subsidy Telangana, Yasangi Season Payments, Government Market Loans, Farmer Welfare Schemes, Direct Benefit Transfer (DBT), Agricultural Fund Mobilization

అన్నదాతలకు శుభవార్త.. త్వరలో రైతుభరోసా రెండో విడత నిధుల విడుదల 

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మొదటి దఫా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయగా, ప్రస్తుతం రెండో విడత కోసం రైతాంగం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. యాసంగి పంటలు చేతికొచ్చే సమయం దగ్గరపడుతుండటంతో, ఈ నెలలోనే పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. యాసంగి సీజన్‌కు సంబంధించి మొత్తం మూడు దఫాలుగా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది.

గత నెల 23న మొదటి దఫా నిధులను ప్రభుత్వం విజయవంతంగా పంపిణీ చేసింది. ఒక ఎకరం లోపు భూమి ఉన్న సుమారు 68,89,955 మంది రైతులకు సంబంధించి, 57,44,907.19 ఎకరాలకు గానూ మొత్తం రూ.3,446.94 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. తాజాగా, రెండో విడత నిధులను ఈ నెల 22వ తేదీలోపు, మూడో విడత నిధులను నెలాఖరుకల్లా జమ చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. రెండో విడతలో ఐదెకరాల వరకు భూమి ఉన్న రైతులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం భారీగా నిధులను సమీకరిస్తోంది. రాష్ట్రానికి వచ్చే జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల ఆదాయం అధిక భాగం వేతనాలు, సబ్సిడీలకే సరిపోతుండటంతో, రైతు భరోసా కోసం బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు సేకరిస్తోంది. ఈ నెల 7న రూ.3,900 కోట్లు తీసుకోగా, 21న మరో రూ.3,000 కోట్లు అప్పుగా తీసుకోనుంది. ఇలా సేకరించిన రూ.6,900 కోట్లలో సుమారు రూ.3,000 నుంచి రూ.4,000 కోట్లను రెండో విడత కింద రైతులకు పంపిణీ చేసే అవకాశం ఉంది. సీజన్ మొత్తం మీద ఈ పథకానికి రూ.9,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా.

Next Story