రీల్స్‌ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం జ్ఞానం లేకపోవడమే: సజ్జనార్

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం.. లైక్స్‌ కోసం.. కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on  22 Sept 2024 5:51 PM IST
రీల్స్‌ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం జ్ఞానం లేకపోవడమే: సజ్జనార్

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం.. లైక్స్‌ కోసం.. కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. అలా రీల్స్ చేస్తున్న క్రమంలో ఇప్పటికే చాలా మంది ప్రమాదాలను కొని తెచ్చుకున్నారు. మరికొందరు అవతల వ్యక్తులనూ ప్రమాదాల్లో పడేశారు. తాజాగా ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహిళ ఒక చేత్తో చంటి బిడ్డను పట్టుకుని.. బావి అంచున కూర్చొని ఉంది. దీన్ని చూసిన నెటిజన్లంతా ఆమె చేసిన పనిని విమర్శిస్తున్నారు.

తాజాగా ఇదే వీడియోపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ ట్రెండ్ పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. తన బిడ్డను ఒక చేత్తో పట్టుకుని బావి అంచున కూర్చున్న మహిళ ఓ హిందీ పాటకు అభినయిస్తుండడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఏ మాత్రం పట్టు తప్పినా ఆమె బావిలో పడిపోతుంది. అంతేకాదు.. కొంచెం పట్టు సడలించినా ఆ చిన్నారి బావిలో పడిపోవడం ఖాయం అని ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది.

దీనిపై సజ్జనార్ స్పందించారు. ఇదెక్కడి పిచ్చి సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం ఇలా పిల్లవాడి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. ఏమాత్రం తేడా వచ్చినా ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస జ్ఞానం లేదా అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. సోషల్ మీడియాకు బానిసలు కాకండి.. ఫేమస్‌ అవ్వడం కోసం ఇలాంటి వెర్రి చేష్టం చేయకండి అంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పేర్కొన్నారు.


Next Story