కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదుట అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికిపైగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలంలో ఉన్న కొంతమంది స్థానికుల సహాయంతో బస్సు అద్దాలను పగులకొట్టి ప్రయాణికులను అందులోనుంచి బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు కళ్లు తిరిగాయని, ఈ క్రమంలోనే బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. గత రెండు, మూడు రోజులుగా బస్సు డ్రైవర్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.