బీజేపీ నుంచి దేశాన్ని రక్షించే దమ్ము కాంగ్రెస్‌కు లేదు: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
ఇటీవల బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పార్టీ ఎంపీ టికెట్ కేటాయించింది.
By Srikanth Gundamalla Published on 22 March 2024 12:15 PM GMTబీజేపీ నుంచి దేశాన్ని రక్షించే దమ్ము కాంగ్రెస్‌కు లేదు: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
ఇటీవల బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పార్టీ ఎంపీ టికెట్ కేటాయించింది. నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. తన రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్మల్ని బాధపెట్టి ఉండొచ్చని శ్రేయోభిలాషులను ఉద్దేశించి అన్నారు. ఒక లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ విషయం అర్థం చేసుకోవాలనీ.. కొందరు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇలాంటి అనాగరిక దాడులు తనకు కొత్త కాదన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. పేదల ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతో రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.
తనపై నమ్మకంతో నాగర్‌కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఇన్నాళ్లు పీడిత ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేశానని చెప్పారు. ఇక చట్టసభల్లో కూడా మీ గొంతు వినిపిస్తానని అన్నారు. ఈ క్రమంలోనే తాను ఎంతో విలువైన ఉద్యోగాన్ని సైతం వదిలి రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. అసెంబ్లీలో బహుజనుల గొంతుక ఉండాలని రాత్రింబవళ్లు శ్రమించినట్లు చెప్పారు. కానీ తొలి ప్రయత్నం విఫలమైందన్నారు. తెలంగాణవాదం-బహుజనవాదం రెండూ ఒక్కటనే నమ్మి కేసీఆర్, మాయావతిని ఒప్పించి పొత్తు పెట్టాలని చెప్పినట్లు తెలిపారు. కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల పొత్తు కుదరలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అయితే.. బీజేపీ కుట్రల నుంచి దేశాన్ని కాపాడే సత్తా కాంగ్రెస్‌కు లేదనీ.. అందుకే బీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. తాను బహుజనుల బంగారు భవిష్యత్ కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
తన ఈ పోరాటంలో శ్రేయోభిలాషులంతా కలిసి రావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. నాగర్‌కర్నూలు నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా తనని గెలిపించి పార్లమెంట్‌కు పంపితే బహుజనుల గొంతుని అక్కడ వినిపిస్తానని చెప్పారు. తాను చట్టసభల్లో కూర్చుంటే బహుజనులంతా కూర్చున్నట్లే అని అన్నారు. వీలువైన సమయం ఇచ్చి.. నాగర్‌కర్నూలు ఎంపీగా కారు గుర్తుకి ఓటేసి తనని గెలిపించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.