రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 10 Sep 2023 5:57 AM GMTరోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఆదివారం హాలీడే సందర్భంగా ట్రిప్‌కు బయల్దేరారు. అయితే.. కారులో మితిమీరిన వేగంతో వెళ్తుండగా చేవెళ్ల ఆరూర్ గేట్ దగ్గర రోడ్డుప్రమాదం సంభవించింది. మరో వాహనాన్ని ఇంజినీరింగ్ విద్యార్థులు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రదీప్ అనే యువకుడు, సోనీ అనే మరో ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న చేవెళ్ల పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
రోడ్డుప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. అయితే.. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు కూడా చెబుతున్నారు. అత్యంత వేగంగా వాహనాలు నడపొద్దని.. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరుతున్నారు. యువత కొందరు ట్రాఫిక్ రూల్స్‌ను పట్టించుకోవడం లేదని.. అలాంటప్పుడే ఇలా ప్రమాదాలు చోటుసుకుంటున్నాయని చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చొద్దని సూచించారు పోలీసులు.