RGI Airport: దక్షిణాసియాలోనే ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా ఎంపిక
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఎ) 'భారతదేశం, దక్షిణాసియాలోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం'గా ఎంపికైంది.
By అంజి Published on 16 March 2023 11:55 AM GMTRGI Airport: దక్షిణాసియాలోనే ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా ఎంపిక
2023 స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డులలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఎ) 'భారతదేశం, దక్షిణాసియాలోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం'గా ఎంపికైనట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జిహెచ్‌ఐఎఎల్) ప్రకటించింది. ప్రయాణీకులచే ఓటు వేసిన ఈ విమానాశ్రయం 'భారతదేశం, దక్షిణాసియాలో ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది' అవార్డును పొందింది.
ఈ ఘనతపై జీఎచ్‌ఐఎల్ సీఈవో ప్రదీప్ పనికర్ మాట్లాడుతూ.. ''ఈ అవార్డును అందుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. మా ప్రయాణీకులకు అసాధారణమైన ప్రయాణ అనుభవాన్ని అందించాలనే మా నిబద్ధతకు గుర్తింపు లభించింది. మా ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సేవలను అందించడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన మా విమానాశ్రయ సిబ్బంది, వాటాదారులు, హైదరాబాద్ విమానాశ్రయంలో పనిచేస్తున్న భాగస్వాముల కృషి, అంకితభావానికి ఈ అవార్డు నిదర్శనం. ఈ గుర్తింపు విమానాశ్రయ అనుభవాలను ఆవిష్కరించడం, మరింత మెరుగుపరచడం కొనసాగించడానికి, అందరికీ సురక్షితమైన, మంచి అనుభవాన్ని అందించడానికి మా నిబద్ధతను బలోపేతం చేయడానికి మమ్మల్ని ప్రేరేపిస్తుంది'' అని అన్నారు.
స్కైట్రాక్స్ సీఈవో ఎడ్వర్డ్ ప్లాస్టెడ్ మాట్లాడుతూ.. ''2023కి సంబంధించి ఈ ముఖ్యమైన కస్టమర్ అవార్డులను గెలుచుకోవడంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విజయం సాధించినందుకు మేము అభినందిస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలకు కోవిడ్ మహమ్మారి సవాలుగా ఉంది. ప్రస్తుతం మహమ్మారి వెనక్కితగ్గడంతో.. ప్రయాణీకుల సంఖ్య సాధారణ స్థితికి రావడం, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తమ కస్టమర్లచే ప్రముఖ విమానాశ్రయంగా గుర్తించబడటం ఆనందంగా ఉంది'' అని అన్నారు.
ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్‌లోని 'ఛాంగి' అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఖతార్‌లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానంలో నిలిచింది. టోక్యోలోని హనీదా విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది. ఇక భారత్‌లోని ఏ విమానాశ్రయమూ తొలి 20 స్థానాల్లో నిలవలేకపోయింది. కానీ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు దక్షిణాసియాలో ఉత్తమ ఎయిర్‌పోర్టుగా నిలిచింది. విమాన ప్రయాణం చేసిన తర్వాత ప్రయాణికులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ప్రతి సంవత్సరం స్కైట్రాక్ సర్వే చేస్తుంటుంది. ప్రపంచంలోనే తొలి 20 బెస్ట్ ఎయిర్‌పోర్టులను గుర్తించి.. వాటిని స్కైట్రాక్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ పేరుతో సత్కరిస్తుంది.