నాంపల్లి అగ్నిప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం: కాంగ్రెస్, బీజేపీ

నాంపల్లి ఘటనపై కాంగ్రెస్‌ చీఫ్ రేవంత్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  13 Nov 2023 1:13 PM IST
revanth reddy, kishan reddy,  nampally, fire accident,

నాంపల్లి అగ్నిప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం: కాంగ్రెస్, బీజేపీ

హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై కాంగ్రెస్‌ చీఫ్ రేవంత్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ ప్రమాదానికి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ ఆరోపించారు.

నాంపల్లి ప్రమాదం గురించి స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. భాగ్యనగరం అగ్నిప్రమాదాలకు నిలయంగా మారుతోందని అన్నారు. వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. నివారణ చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ సర్కార్‌ పూర్తిగా విఫలం అయ్యిందంటూ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో కారు మరమ్మతులు చేయడం ఏంటని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిల్వ చేస్తారంటూ ఆయన నిలదీశారు. నాంపల్లి అగ్నిప్రమాద సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ అగ్నిప్రమాద సంఘటన చాలా దురదృష్టకరమని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జంట నగరాల్లో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. జనాలు నివసించే చోట్ల వ్యాపార సముదాయాలు నిర్వహించకూడదని తాను గతంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రమాదం జరిగిన భవనాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు కేంద్రం తరఫున ఆర్థిక సాయం అందేలా ప్రధాని మోదీతో మాట్లాడతానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా కుటుంబాలను ఆదుకోవాలన్నారు కిషన్‌రెడ్డి. అగ్నిప్రమాదాలకు అవకాశాలున్న వ్యాపార సముదయాలను ఇకనైన నగరం బయటకు తరలించేలా ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story