ఎమ్మెల్యే కొడుకు అరాచ‌కాలు సీఎంకు తెలియ‌వా..? రాఘవను అరెస్ట్‌ చేయాలి

Revanth Reddy Fires on Vanama Raghava over palvancha family suicide case.భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పాల్వంచ‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2022 7:15 AM GMT
ఎమ్మెల్యే కొడుకు అరాచ‌కాలు సీఎంకు తెలియ‌వా..?  రాఘవను అరెస్ట్‌ చేయాలి

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పాల్వంచ‌లో నాగ‌రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం తెలిసిందే. ఎందుకు త‌న కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకుంటుందో సెల్పీ వీడియోలో నాగ రామ‌కృష్ణ చెప్పారు. తన కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవయే కారణమని.. త‌న‌ని డ‌బ్బు రూపంలో ఏం అడిగినా ఇచ్చే వాడిన‌ని.. అయితే.. త‌న భార్య‌ను హైద‌రాబాద్‌కు తీసుకురావాల‌ని అడిగాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ప్ర‌స్తుతం ఈ సెల్పీ వీడియోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి అరాచ‌కాల‌పై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.

తాజాగా ఈ వ్య‌వ‌హారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ కీచక పర్వానికి ఓ కుటుంబం బలైందని, రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో వ్యక్తం చేసిన ఆవేదన చూస్తే సభ్యసమాజం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంద‌న్నారు. తక్షణం రాఘవను అరెస్టు చేయాలని, ఎమ్మెల్యే గా వనమాతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. 'రాఘ‌వ లాంటి మృగానికి అధికార టీఆర్ఎస్ అండ‌గా నిల‌వ‌డం దుర్మార్గం. రాఘ‌వ కీచ‌క చేష్ట‌ల‌కు రామ‌కృష్ణ కుటుంబం మూడు రోజులైనా చ‌ర్య‌లెందుకు లేవు..? తొలి రోజు నుంచే రాఘ‌వ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ అరెస్ట్ ఎందుకు చేయ‌లేదు..? వారిని ఎవ‌రు కాపాడుతున్నారు..? ఎమ్మెల్యే కుమారుడు ఇన్ని అరాచ‌కాలు చేస్తుంటే సీఎంకి తెలియ‌క‌పోవ‌డం ఏమిటీ..? మీ ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ ఏం చేస్తోంది..? ప్ర‌తిప‌క్ష నాయ‌కుల ప్ర‌జా పోరాటాల‌పై నిఘాకే ప‌రిమితం అయ్యిందా..? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. వారి వార‌సులు భూక‌బ్జాలు, సెటిల్‌మెంట్లలో మాఫియాను మించిపోయారు. వెంట‌నే రాఘ‌వ‌ను అరెస్ట్ చేయాల‌ని' రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story