ప్రగతి భవన్‌ను ప్రజల కోసం వినియోగిస్తాం: రేవంత్‌రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 4:08 PM ISTప్రగతి భవన్‌ను ప్రజల కోసం వినియోగిస్తాం: రేవంత్‌రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2009 డిసెంబర్ 3లో శ్రీకాంతాచారి అమరుడు అయ్యారని చెప్పారు. ఇప్పుడు 2023 డిసెంబర్ 3న తెలంగాణ ప్రజలంతా విలక్షణమైన తీర్పు ఇచ్చారు. తద్వారా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి.. శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు అర్పించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఇచ్చారని రేవంత్ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ఎప్పుడూ పాటుపడుతుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆనాడు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నిర్వహించారు. తెలంగాణలో 21 రోజుల పాటు జోడో యాత్ర కొనసాగిందని అన్నారు. జోడో యాత్ర ద్వారా రాహుల్‌గాంధీ తమలో స్ఫూర్తిని నింపారని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడంలో ఉత్తమ్, కోమటిరెడ్డి, వీహెచ్, మధుయాష్కి, భట్టి ఇలా సీనియర్ నాయకులందరి సహకారంతో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించిందని అన్నారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు రేవంత్‌రెడ్డి. తెలంగాణలో ఉన్న పేదలను ఆదుకునేందుకు.. రాష్ట్ర అభివృద్ధికి.. మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ముందుంటుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ గెలపుని కేటీఆర్ కూడా అభినందించారని వెల్లడించారు. ప్రజల తీర్పును గౌరవించాలన్నారు. కాంగ్రెస్ అధికారం ఏర్పాటు చేయబోయే కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానం పంపుతాం. పౌర హక్కులను నిలబెట్టడానికి కాంగ్రెస్ సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు.. ఇతర హామీలను నెరవేరుస్తామని చెప్పారు. సీపీఐ తమతో పొత్తు పెట్టుకుని ఒక స్థానంలో గెలిచిందన్నారు. కోదండరాం సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పారు రేవంత్‌రెడ్డి.
ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని రేవంత్‌రెడ్డి అన్నారు. పాలక పక్షం, ప్రతిపక్షం ఎవరు అనేది ప్రజలు నిర్ణయించారు. వారు ఇచ్చిన తీర్పును శిరసా వహించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో నూతన సంప్రదాయానికి, ప్రజాస్వామ్య విలువలను పునరుద్దరించడానికి బీఆర్ఎస్ తమతో పాటు ముందుకు వస్తుందని ఆశిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి అందరం కలిసి ముందుకు వెళ్దామని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
సచివాలయ గేట్లు సామాన్యుల కోసం తెరుచుకుంటాయని.. ప్రగతి భవన్ ఇక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజాభవన్‌గా మారుతుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. సామాన్య ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికే సచివాలయం ఏర్పాటు. ప్రగతి భవన్ ప్రజల ఆస్తి.. ప్రజల కోసమే వినియోగిస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. అన్ని విధాలా సహకారాలు అందించిన రాహుల్‌గాంధీకి, ఎన్నికల ప్రచారంలో తనతో పాటు ఉత్సాహంగా పాల్గొన్న ప్రియాంక గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రేవంత్‌రెడ్డి.