నిర్మల్ జిల్లా బాసరలో బంద్ కొనసాగుతోంది. బాసర సరస్వతీ దేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రంజెర్ల రాజేష్‌పై ఆలయ పూజారులు, దుకాణదారులు, గ్రామస్తులు, హిందూ సంఘాలు నిరసనలకు దిగడంతో బాసరలో ఉద్రిక్తత నెలకొంది. 'సరస్వతి దేవి చదువుల తల్లి కాదని.. మ్యూజిక్ టీచర్' అంటూ రాజేశ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సరస్వతి దేవీ ఏ యూనివర్సిటీలో చదువుకోని వచ్చిందని ప్రశ్నించారు. సరస్వతి దేవి చదువుల తల్లి అయితే పుస్తకం ఉండాలి కదా, వీణ ఎందుకు ఉంది? అంటే ఆమె మ్యూజిక్ టీచర్ కదా అంటూ పదే పదే ఆయన చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి.
చదువుల తల్లి సరస్వతీ దేవిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేష్‌పై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయం ఎదుట కూర్చొని నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే బాసరలో పోలీసులు భారీగా మోహరించారు. గతంలోనూ రాజేష్ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తున్నాయి హిందూ సంఘాలు.
రాజేష్‌పై పీడీ యాక్ట్ పెట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు. అంతకుముందు బైరి నరేష్ కూడా అయ్యప్ప స్వామి, ఇతర హిందూ దేవుళ్లపై కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యప్ప భక్తులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. అయ్యప్పస్వామిపై బైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో రెంజర్ల రాజేష్ ఆ సభలోనే ఉన్నాడు. సోషల్ మీడియాలో బైరి నరేష్‌కు మద్దతు తెలపడంతో రాజేష్ పై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు ఆయన ఇంటి ముందు ఆందోళన చేశారు.