మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్

ఇటీవల జరిగిన తాండూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించారనే కేసులో...

By -  అంజి
Published on : 21 Feb 2026 9:46 AM IST

Pilot Rohith Reddy, Tandur Municipal Elections, Telangana High Court, Anticipatory Bail, Justice Kalasikam Sujana, Counting Center Case, Vikarabad Police

మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్

హైదరాబాద్: ఇటీవల జరిగిన తాండూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించారనే కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా తొమ్మిది మందికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం జస్టిస్ కలసికం సుజన ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 13న తాండూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో, నిందితులు బలవంతంగా లెక్కింపు కేంద్రంలోకి చొరబడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్ పోలీసులు రోహిత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా (A1) పేర్కొంటూ, మరో ఎనిమిది మందిపై క్రైమ్ నంబర్ 50/2026 కింద కేసు నమోదు చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం, అక్రమంగా గుమిగూడటం వంటి అభియోగాలపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కలసికం సుజన పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారు ప్రధానంగా ప్రభుత్వ అధికారులే, దర్యాప్తులో భాగంగా నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ప్రస్తుతం కనిపించడం లేదు,ఈ కారణాల దృష్ట్యా పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సమంజసమని కోర్టు అభిప్రాయపడింది.

బెయిల్ మంజూరు చేస్తూనే కోర్టు కొన్ని కఠిన నిబంధనలను విధించింది. నిందితులు రెండు వారాల్లోగా తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (SHO) ముందు లొంగిపోవాలి. రూ. 25,000 వ్యక్తిగత బాండ్ మరియు ఇద్దరు సమాన పూచీకత్తులు సమర్పించాలి. వచ్చే ఎనిమిది వారాల పాటు లేదా ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు (ఏది ముందైతే అది) ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలి. దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని కోర్టు ఆదేశించింది.

Next Story