హైకోర్టులో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేకు ఊరట

నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

By Srikanth Gundamalla  Published on  14 Aug 2023 11:45 AM GMT
relief,  Nagarkurnooly MLA,  High Court ,

హైకోర్టులో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేకు ఊరట

నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నిక వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. మర్రి జనార్ధన్‌రెడ్డి ఎమ్మెల్యే ఎన్నిక రద్దు చేయాలంటూ నాగం జనార్ధన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం ఆయన అప్పీల్‌ను కొట్టివేసింది. 2019లో నాగం జనార్దన్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం తాజాగా తీర్పు వెల్లడించింది.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగం జనార్ధన్‌రెడ్డిపై మర్రి జనార్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే..మర్రి జనార్ధన్‌రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్‌లో అబద్ధాలను చెప్పారని.. కొన్ని వివరాలను దాచి దాఖలు చేశారంటూ నాగం జనార్ధన్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. అదే పిటిషన్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. నాగం జనార్ధన్‌రెడ్డి తగిన ఆధారాలు పిటిషన్‌లో చూపించలేకపోయారని.. అందుకే ఆయన అప్పీల్‌ను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు పేర్కొంది. కాగా.. కొంతకాలం ముందు ఇలాంటి కేసులోనే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వనమా నాగేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం వనమా ఎన్నిక విషయంలో హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.

Next Story