హైదరాబాద్: సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా చూడాలనుకునే వారికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఇకపై పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. 2021లో జారీ చేసిన జీవో (GO) 121ని హైకోర్టు సస్పెండ్ చేయడంతో, టికెట్ ఉన్న ప్రేక్షకుడి నుంచి పార్కింగ్ రుసుము వసూలు చేసే హక్కును సింగిల్ స్క్రీన్ థియేటర్లు కోల్పోయాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం, మల్టీప్లెక్స్‌లు మరియు షాపింగ్ మాల్స్‌లో చెల్లుబాటు అయ్యే బిల్లు లేదా సినిమా టికెట్ చూపిస్తే ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. అయితే, 2021 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఈ నిబంధన నుంచి ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది.
తాజా హైకోర్టు తీర్పుతో ఈ మినహాయింపు రద్దయి, మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ ఉచిత పార్కింగ్ నిబంధన అమల్లోకి రానుంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్ థియేటర్ ఒక ప్రేక్షకుని నుంచి ₹20 పార్కింగ్ ఫీజు వసూలు చేయడంతో ప్రేమ్ రామావత్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, ఎటువంటి సరైన కారణాలు లేకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఇచ్చిన మినహాయింపును తప్పుబట్టింది. ఈ తీర్పు కేవలం ఒక్క థియేటర్‌కు మాత్రమే పరిమితం కాదని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వర్తిస్తుందని అడ్వకేట్ విజయ్ గోపాల్ స్పష్టం చేశారు. వినియోగదారుడి వద్ద సినిమా టికెట్ ఉంటే పార్కింగ్ ఉచితంగా కల్పించాల్సిందేనని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.