పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్లు విడుదల చేయండి: కేసీఆర్‌కు ఒవైసీ లేఖ
Release pending Aasara pensions Owaisi writes to KCR.ఆసరా పింఛన్ల మంజూరు, విడుదలకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు
By తోట వంశీ కుమార్ Published on 13 Nov 2022 12:36 PM ISTఆసరా పింఛన్ల మంజూరు, విడుదలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేఖ రాశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ పథకాలను పునరుద్ధరించడం, ఈ పెన్షన్ల కింద సహాయం, వయోపరిమితిలో సడలింపు పెంచడం వంటి టిఆర్ఎస్ ప్రభుత్వ చర్యను స్వాగతిస్తున్నట్లు ఒవైసీ లేఖలో పేర్కొన్నారు.
కొత్త పింఛన్ల మంజూరులో అనేక సమస్యలు ఉన్నాయని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్‌లను విడుదల చేయాలని, 57 ఏళ్లు నిండిన అర్హులైన పింఛన్‌దారులందరికీ కొత్త గుర్తింపు కార్డులు అందజేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ఒవైసీ కేసీఆర్‌ను కోరారు.
ఇమామ్‌లు, మౌజమ్‌ల గౌరవ వేతనం పెండింగ్‌లో ఉంది
తెలంగాణలోని ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవ వేతనం మంజూరు, విడుదలకు సంబంధించి ఏఐఎంఐఎం అధినేత మరో లేఖ రాశారు. రాష్ట్రంలో మసీదుల్లో పనిచేసే ఇమామ్, మౌజామ్లకు గత 5 నెలలుగా గౌరవ వేతనం చెల్లించడం లేదన్నారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. నెలల తరబడి గౌరవ వేతనం అందక వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో 10,000 మంది ఇమామ్‌లు పని చేస్తున్నారని వారికి ప్రభుత్వం ఇచ్చే రూ.5వేల గౌరవ వేతనమే ఆధారమని అన్నారు. గత జూలైలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడంతో వక్ఫ్ బోర్డు అధికారులు చెక్కులు పంపించినా.. ఆర్థిక శాఖ నుంచి మాత్రం క్లియరెన్స్ రావడం లేదన్నారు. రాష్ట్రంలోని ఇమామ్‌లు, మౌజామ్‌లకు చెల్లించాల్సిన అన్ని చెల్లింపులను క్లియర్ చేసేలా ఆర్థిక శాఖను ఆదేశించాలని ఒవైసీ లేఖలో కేసీఆర్‌ను అభ్యర్థించారు.