ఐదుగురు తెలంగాణ వాసులకు దుబాయ్ కోర్టు విముక్తి
హత్య కేసులో దుబాయ్‌లో 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఐదుగురికి విముక్తి లభించింది. ఎన్నో ఏళ్ల తర్వాత కుటుంబీకులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
By అంజి Published on 21 Feb 2024 10:42 AM ISTఐదుగురు తెలంగాణ వాసులకు దుబాయ్ కోర్టు విముక్తి
హత్య కేసులో దుబాయ్‌లో 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఐదుగురికి విముక్తి లభించింది. ఎన్నో ఏళ్ల తర్వాత కుటుంబీకులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. నేపాల్‌కు చెందిన బహదూర్ హత్య కేసులో వీరికి కోర్టు 25 ఏళ్ల శిక్ష వేసింది. కొన్నేళ్ల కిందట మాజీ మంత్రి కేటీఆర్ హతుని కుటుంబీకులకు రూ.15 లక్షలు ఇచ్చి క్షమాభిక్ష పత్రం రాయించినా.. మారిన నిబంధనలతో కోర్టు కోర్టు ఒప్పుకోలేదు. అనారోగ్య కారణాలు చూపుతూ నిందితుల తరఫు న్యాయవాదులు మరోసారి ప్రయత్నించారు. దీనికి అంగీకరించిన దుబాయి కోర్టు ఏడేళ్లు ముందే వారిని విడుదల చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం (48), శివరాత్రి రవి (45) అన్నదమ్ములతోపాటు కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్ (48), చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి (48), జగిత్యాల జిల్లా మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు (51) 2004లో ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లారు. వెళ్లిన ఆరు నెలల అనంతరం నేపాల్ కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్యకు గురయ్యాడు. అక్కడే పని చేస్తున్న జిల్లా వాసులు ఈ ఐదుగురు కేసులో ఇరుక్కున్నారు. భాష సరిగా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు కానీ శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట పదేళ్లు జైలు శిక్ష వేసింది.
అనంతరం అప్పిలుకు వెళ్ళగా 25 ఏళ్ల శిక్ష విధించింది. దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమా భిక్ష పెడితే విడుదల అవకాశం ఉండగా 2011లో ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ తీసుకొని ఒకసారి నేపాల్ కూడా వెళ్లి వచ్చారు. నేపాల్ కు చెందిన బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ, ఇతర ప్రతినిధుల సహకారంతో క్షమాభిక్ష పై సంతకాలు చేయించారు.
వారికి ఆర్థికంగా కేటీఆర్ పదిహేను లక్షల రూపాయల చెక్కును అందించారు. అప్పుడే దుబాయ్ లో చట్టాలు మారడంతో విడుదల గగనమైంది వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టి వేసింది. సెప్టెంబర్ లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్ళీ కేసు వేయించడం, కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి ఈ కేసులో క్షమాభిక్ష కోరడం కోసం మంత్రి దుబాయ్ లో అక్కడి అధికారులతో సమీక్షించారు. చివరకు జైలు శిక్ష పడిన ఐదుగురు తెలంగాణ వాసులు విడుదలయ్యారు.